కౌలురైతుల లబోదిబో

వేలాది ఎకరాల్లో పంటనష్టంతో తీరని వ్యథ
విజయవాడ,డిసెంబర్‌3 (జనంసాక్షి) : నివర్‌ తుఫాన్‌తో సాధారణ రైతులే కాకుండా వేలాదిమంది కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారు. పెట్టిన పెట్టుబడి సంగతలా ఉంటే..మొత్తం కొట్టుకు పోవడంతో కౌలు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉన్నారు. జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ పర్యటనలో కూడా ఇదే ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. పెద్దపారుపూడి, గుడ్లవల్లేరు, నందివాడ, ముదినేపల్లి మండలాల్లో వేలాది ఎకరాల్లో పంట నష్టపోయిన వందలాది మంది దళిత, బలహీన, పేద కౌలు రైతులకు ప్రభుత్వం ఆదుకోవాలని కౌలు రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బివి.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. కౌలు కార్డులతో సంబంధం లేకుండా ఎకరానికి రూ.30 వేలు నష్టపరిహారం, 25 కేజీల మినుములు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.  నివర్‌ తుపాన్‌ వలన పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం చేస్తామన్న సాయానికి నిబంధనల
మాటున పెద్ద ఎత్తున కోతలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఒక సీజన్‌లో ఎన్ని విపత్తులచ్చి పంటలు పోయినా ఒక్క తడవే పరిహారం అనే షరతు ముందుకురాగా తాజాగా పంటల బీమా, పెట్టుబడి
రాయితీరెండింటిలో ఏదో ఒకటే ఇవ్వాలనే అంశం తెర విూదికొచ్చింది. రబీ పంటలు సాగు చేసి నాలుగు వారాల్లోపే అయితే ఇన్సూరెన్స్‌, ఇన్‌పుట్‌ సబ్సిడీ ఏ ఒక్కటీ రాదని సూతప్రాయంగా తేల్చారు.
ఖరీఫ్‌ పంట కోతల సమయంలో తుపాన్‌ ముంచెత్తడంతో వరి పంటకు అపార నష్టం జరిగింది. పంట కోసి పనల విూద ఉంటే బీమా వర్తిస్తుంది. ఇన్‌పుట్‌ సబ్సిడీ రాదు. వర్షాలకు వరి చేలల్లో నీళ్లలో వాలిపోయి మునిగిపోయి కుళ్లిపోయి తుడుచుపెట్టుకుపోయినా బీమా రాదు. అలాంటి రైతులకు కేవలం ఇన్‌పుట్‌ సబ్సిడీ వస్తుంది. పంట నాశనం అయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఇన్సూరెన్స్‌ రెండూ ఇచ్చినా రైతుకు జరిగిన పెట్టుబడుల నష్టం పూడదు. అలాంటిది ఏదో ఒక్కటేననడంతో అన్నదాతల్లో ఆందోళన బయలుదేరింది. ఉచిత పంటల బీమా వలన ఈ ఖరీఫ్‌ నుంచి ఇన్సూరెన్స్‌ క్లెయిముల మొత్తాన్నీ ప్రభుత్వమే భరించాలి.
రోవైపు ఇన్‌పుట్‌ సబ్సిడీ లబ్దిదారులను తగ్గించేందుకు నిబంధనలకు పదును పెడుతున్నారు. నివర్‌ వలన గుంటూరు జిల్లాలో అత్యధిక విస్తీర్ణంలో పంట నష్టం జరిగినట్లు ప్రాధమిక అంచనాలు చెబుతున్నాయి. నష్టం 1.33 లక్షల హెక్టార్ల నుంచి 50-60 వేల హెక్టార్లకు ఎన్యుమరేషన్‌లో తగ్గిస్తున్నారు. వరి చేలల్లో నుంచి వర్షపు నీరు తీసిందని, 35 వేల హెక్టార్లలో పంట బయట పడిందని చెబుతున్నారు. కృష్ణాలో 95 వేల హెక్టార్ల నుంచి 40 వేల హెక్టార్లకు తగ్గిస్తున్నారు. నెల్లూరులో వరి నాట్లు 3,300 హెక్టార్లలో దెబ్బతిన్నప్పటికీ నాలుగువారాల్లోపు ఉన్న నర్సరీలకు ఇన్‌పుట్‌, ఇన్సూరెన్స్‌ రెండూ రావని నిర్ణయించారు. ప్రకాశంలో రబీ శనగ 17 వేల హెక్టార్లలో దెబ్బతినగా మొత్తం నాలుగువారాల్లోపు వేసినవేనని, ఇన్‌పుట్‌, ఇన్సూరెన్స్‌ రెండూ రావని తేల్చారు. కడపలో శనగ, మినుము, వరి విషయంలోనూ ఇదే నిబంధనను అమలు చేసి బాధిత రైతులకు బీమా, పెట్టుబడి రాయితీలను రాకుండా చేస్తున్నారు.