క్రాకర్స్ అమ్మకం దారులకు గుడ్ న్యూస్
2గంటలపాటు క్రాకర్స్ కాల్చేందుకు సుప్రీం అనుమతి
హైకోర్టు ఆదేశాలను సడలించిన సుప్రీం
తాజా ఉత్తర్వులతో అమ్మకాలకు సిద్దంగా వ్యాపారులు
న్యూఢిల్లీ,నవంబర్13(జనంసాక్షి): తెలంగాణలో బాణసంచాను నిషేధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీచేసింది. టపాసుల నిషేధంపై సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవరిస్తూ గ్రీన్ క్రాకర్స్‌కు అనుమతినిచ్చింది. ఎన్‌జీటీ ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలని ఉత్తర్వులు జారీచేసింది. దీపావళి రోజు 2 గంటలపాటు టపాసులు కాల్చుకునేందుకు అవకాశం కల్పించింది. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు అనుమతి మంజూరు చేసింది. సుప్రీంకోర్టు తీర్పుతో బాణసంచా వ్యాపారులకు ఊరట లభించింది. కాగా కరోనా వైరస్ నేపథ్యంలో క్రాకర్స్‌ను నిషేధిస్తూ హైకోర్టు తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. దీంతో ప్రభుత్వం కూడా నిషేధ ఉత్తర్వులను ఇచ్చింది. అయితే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ వ్యాపారులు సుప్రీంకోర్టులో శుక్రవారం లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం రెండు గంటల పాటు గ్రీన్ క్రాకర్స్ కాల్చేందుకు అనుమతినిచ్చింది. ఈ రెండుగంటల్లో కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వెసులబాటు ఉంది. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రంలో బాణసంచాపై నిషేధం విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో క్రార్స్ అమ్మకం దారులు ఆందోళన చెందారు. బాణాసంచా అమ్మకాలను నిషేధించడంతో మనస్థాపానికి గురైన దుకాణదారులు సైదాబాద్ ప్రధాన రహదారిపై తమ టపాసులు తామే కాల్చుకుంటూ నిరసన వ్యక్తం చేశారు. విక్రయదారుల కుటుంబాల్లో కోర్టు ఉత్తర్వులు చీకట్లు నింపిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో బాణసంచా నిషేధించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించిన ఉత్తర్వులను వెంటనే ఎత్తి వేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు సుప్రీంను ఆశ్రయించారు. అయితే ప్రభుత్వ ఆదేశాలతో హన్మకొండలో దీపావళి టపాసుల దుకాణాలు వెలవెలబోతున్నాయి. కరోనా మహమ్మారి, హైకోర్టు అదేశాల మేరకు ప్రభుత్వం బాణసంచాపై నిషేధం విధించడంతో హన్మకొండలోని హయగ్రీవచారి మైదానంలో ఏర్పాటు చేసిన టపాసుల దుకాణాలు కొనుగోలు దారులు లేక ఖాళీగా దర్శనిమిచ్చాయి. గతంలో 150 దుకాణాలు ఉండగా ఈసారి కరోనా నేపథ్యంలో కేవలం 50 షాపులకే అధికారులు అనుమతి ఇచ్చారు. 50 షాపులున్నప్పటికీ గిరాకీ లేక పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేలా లేదంటూ వ్యాపారులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పు చేసి టపాసులను కొనుగోలు చేశామని తీరా విక్రయించే సమయంలో టపాసుల కాల్చడంపై నిషేధం విధించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందే చెబితే తాము టపాసుల దుకాణాలు పెట్టకుండా ఉండేవారిమని.. వేలు ఖర్చు పెట్టి సరకు కొనుగోలు చేశామని తీరా అమ్మే సమయంలో ఇలా నిషేధించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేసారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో అధికారులు బాగారెడ్డి స్టేడియంలో బాణసంచా అమ్మకాల దుకాణాలను మున్సిపల్, పోలీసు అధికారులు తనిఖీ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ నెలాఖరు వరకు టపాసుల అమ్మకాల నిలిపివేయాలని సూచిస్తూ దుకాణాలను మూసి వేయించారు. ఈ సందర్భంగా దుకాణంలోని బాణసంచాను ఖాళీ చేయించి వాహనాల్లో తరలించే ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా అమ్మకాలు చేపడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజారోగ్యం దృష్ట్యా దీపావళి పండుగ రోజు టపాసులు కాల్చడం మానుకొని అధికార యంత్రాంగానికి సహకరించాలని జహీరాబాద్ ప్రజలను అధికారులు కోరారు. తాజాగా సుప్రీం ఆదేవాలతో ఇక అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లు అయ్యింది.