క్రిస్మస్‌ పరేడ్‌లో విషాదం

జనం విూదకు దూసుకెళ్లిన కారుపలువురు మృతి..

20మందికి పైగా గాయాలు

వాషింగ్టన్‌,నవంబర్‌22(జనం సాక్షి):  అమెరికాలో క్రిస్మస్‌ పెరేడ్‌లో విషాదం నెలకొంది. విస్కాన్సిన్‌ రాష్ట్రంలో ఆదివారం రాత్రి క్రిస్మస్‌ పెరేడ్‌ చేస్తోన్న జన సమూహాంపై కారు దూసుకెళ్లడంతో పలువురు మృతి చెందగా.. 20 మందికి పైగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. అయితే ఎంత మంది చనిపోయారో నిర్దారణ కావాల్సి ఉంది. మిల్వాకీ శివారు ప్రాంతమైన వౌకేషాలో క్రిస్మస్‌ పరేడ్‌ జరుగుతుండగా.. ఎస్‌యువి కారు.. జనాలపై నుండి దూసుకెళ్లిపోయిందని పోలీస్‌ చీఫ్‌ డాన్‌ థామ్సన్‌ అన్నారు. సుమారు 20 మందిపై నుండి వాహనం దూసుకెళ్లగా.. అందులో చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, 11 మంది పెద్దల్ని, 12 మంది చిన్నారుల్ని ఆరు ఆసుపత్రుల్లో చేర్చినట్లు ఫైర్‌ చీఫ్‌ స్టీవెన్‌ హవార్డ తెలిపారు. నిందితుడ్ని, కారును అదుపులోకి తీసుకున్నట్లు థామ్సన్‌ వెల్లడిరచారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్పందించారని వైట్‌హౌస్‌ తెలిపింది. వౌకేషాలో పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని, ఈ భయానక ఘటనలో ప్రతి ఒక్కరి హృదయాలు బరువెక్కాయి అన్నారని పేర్కొంది. అవసరమైన మద్దతు, సాయాన్ని అందించేందుకు స్థానిక అధికారులను సంప్రదించినట్లు వైట్‌హౌస్‌ అధికారి వెల్లడిరచారు.