క్రీడారత్నాలకు పురస్కారాలు

C

– పీవీ సింధుకు ఖేల్‌రత్న పురస్కారాలు

న్యూఢిల్లీ,ఆగస్టు 29(జనంసాక్షి):జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్‌ లో క్రీడా అవార్డుల ప్రధానోత్సవం కన్నుల పండువగా జరిగింది. క్రీడాకారులకు, కోచ్‌ లకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అవార్డులను అందజేశారు. రియో ఒలింపిక్స్‌ సిల్వర్‌ మెడలిస్ట్‌ పివి సింధు అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్‌ ఖేల్‌ రత్నను, కోచ్‌ నాగపురి రమేష్‌ ద్రోణాచార్య పురస్కారాన్ని అందుకున్నారు.హాకీ లెజెండ్‌ ధ్యాన్‌ చంద్‌ జయంతి సందర్భంగా ప్రతి ఏటా నిర్వహించే జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి భవన్‌ లోని అశోక హాలులో క్రీడా అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికిచ్చే ఖేల్‌ రత్న, అర్జున అవార్డులతో పాటు క్రీడాకారులను తీర్చిదిద్దిన కోచ్‌ లకు ద్రోణాచార్య పురస్కారాల ప్రధాన కార్యక్రమం రాష్ట్రపతి భవన్‌ లో ఘనంగా జరిగింది.రియో ఒలింపిక్స్‌ లో సిల్వర్‌ మెడల్‌ అందించి యావత్‌ భారతావనిని మురిపించిన హైదరాబాద్‌ షట్లర్‌ పివి సింధుకు అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్‌ ఖేల్‌ రత్నను రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అందజేశారు. సింధుతో పాటు రియో బ్రాంజ్‌ మెడలిస్ట్‌ సాక్షి మాలిక్‌, అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌, షూటర్‌ రీతూరాయ్‌.. ఖేల్‌ రత్న అవార్డు అందుకున్నారు. ఖేల్‌ రత్నతో పాటు ప్రశంసాపత్రం, ఏడున్నర లక్షల చెక్‌ అందజేశారు.36 ఏళ్ల తర్వాత భారత్‌ నుంచి ఒలింపిక్స్‌ కు అర్హత సాధించిన స్ప్రింటర్‌ ద్యుతిచంద్‌ తోపాటు పలువరు ఒలింపియన్లను తయారుచేసిన అథ్లెటిక్‌ కోచ్‌, వరంగల్‌ బిడ్డడు నాగపురి రమేష్‌ రాష్ట్రపతి చేతుల విూదుగా ద్రోణాచార్య అవార్డు అందుకున్నారు. అలాగే దీపా కర్మాకర్‌ కోచ్‌ విశ్వేశ్వర్‌ నంది, సాగర్‌, రాజ్‌ కుమార్‌, ప్రదీప్‌ కుమార్‌, మహావీర్‌ సింగ్‌ ద్రోణాచార్య పురస్కారం, ప్రశంసాపత్రం, అయిదు లక్షల చెక్‌ అందుకున్నారు. క్రికెటర్‌ అజింక్యా రహానే, అథ్లెట్‌ లలితా బాబర్‌, బాక్సర్‌ శివథాపా, హాకీ ప్లేయర్లు రఘునాథ్‌, రాణీ రాంపాల్‌ సహా 15 మంది అర్జున పురస్కారాలు అందుకున్నారు.సత్తి గీత, సిల్వానన్‌ డంగ్‌ డంగ్‌, రాజేంద్ర ప్రహ్లాద్‌ షెల్కేలకు ధ్యాన్‌ చంద్‌ జీవన సాఫల్య పురస్కారాలను రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అందజేశారు.క్రీడా అవార్డుల ప్రధానోత్సవం కన్నుల పండవగా జరిగింది. క్రీడల మంత్రి విజయ్‌ గోయల్‌ తో సహా అవార్డులు పొందినవారి కుటుంబసభ్యులు, అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.