ఖరీఫ్ ఆశల గల్లంతుతో రైతుల్లో ఆందోళన
వర్షాభావంతో దిక్కు తోచని స్థితిలో రైతాంగం
ఒంగోలు,సెప్టెంబర్1 జనం సాక్షి ఖరీఫ్‌పై ఆశలు గల్లంతయినట్లేనని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపున రబీ కూడా రానే వస్తోంది. వర్షాలు పడితే తప్ప రబీలోనూ పంటలపై ఆశలు కనిపించడం లేదు. జిల్లాలో నాలుగేళ్ల తర్వాత మళ్లీ కరువు వచ్చింది. నీటి సమస్య కూడా జఠిలమయ్యేలా ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే భూగర్జజలాలు కూడా అడుగంటేలా ఉన్నాయి. ఇప్పటికే ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఖరీఫ్
సాగు అర్దాంతరగా ఆగిపోవడానికి కారణం వర్షాభావమే. మూడు నెలల్లో 30 శాతం లోటు ఉంది. ఆగస్టు నెలాఖరుతో ఖరీఫ్ సీజనుకు అదును దాటుతుంది. గడిచిన మూడు నెలల్లో సాగు జరిగితే సెప్టెంబరులో ఎదుగుదల, పూతపిందె..తర్వాత నూర్పిడి ఉంటుంది. ఇప్పటి వరకూ 18 శాతం విస్తీర్ణంలోనే పంటలు సాగయ్యాయి.గ్రామాల్లో రైతులు పొలాలు దున్ని సిద్ధంగా ఉన్నారు. జూన్ నుంచి ఇప్పటి వరకూ సరైన వర్షాలు లేవు. దీంతో సాగు ముందుకు సాగలేదు. ఖరీఫ్ పంటలపై ఆశలు కనిపించడం లేదు. రోవైపు సాగర్ రిజర్వాయర్ లోనూ నీరు లేనందున మాగాణి సాగుపైనా సందిగ్ధం నెలకొంది. కరువు పరిస్థితులు దేశమంతా కొనసాగుతున్నాయి. ఎగువప్రాంతాల్లో వర్షాలు లేనందున డ్యాములకు నీరు రాలేదు. మాగాణి, ఆరుతడి పంటల సాగు కూడా గగనంగానే మారింది. వరినారు పోశారు. పొగనారు మళ్లు పోస్తున్నారు. నీటిపైనే స్పష్టత లేదు. వర్షాలపైనా నమ్మకం లేదు. మూడు నెలలుగా రైతులు ఖాళీగానే ఉన్నారు. సాగుచేసిన అరకొర పంటలు కూడా ఎండుతున్నాయి. ఏ పంటకూడా చేతికి అందే పరిస్థితి లేదు. కొన్ని చోట్ల నువ్వు సాగుచేశారు. ఇపుడే పీకారు. ఏదేమైనా ఇవి కూడా ఆశాజనకంగా లేవు. మరో నెలరోజులపాటు ఖరీఫ్‌కు అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే సెప్టెంబరులో వర్షాలు కురవాలి. సాధారణ వర్షపాతమే 128.5 మిల్లీవిూటరు ఉంది.ఇప్పటికే కరువు పరిస్థితులున్నందున భారీ వర్షాలు కురిస్తే తప్ప ఖరీఫ్‌పై ఆశలు పోయినా రబీకి సానుకూలత ఏర్పడుతుంది. వర్షాలు లేకుండా ప్రత్యామ్నాయ పంటలపైనా దృష్టిసారించినా ఫలితం కనిపించడం లేదు.