ఖర్చులేకుండా ప్రభుత్వాసుపత్రిలో ప్రసవాలు

నిజామాబాద్‌, నవంబర్‌ 29 : గర్భిణీ స్త్రీలకు ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా ప్రభుత్వ ఆసుపత్రులలోనే ప్రసవాలు జరుపుతున్నామని, వీటిని వినియెెూగించుకోవాలని జిల్లా కలెక్టర్‌ క్రిస్టినా కోరారు. గురువారం నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో మార్పు పథకం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని యువత, రైతులు, మహిళలు ఆధునిక వ్యవసాయంపై దృష్టిని సారించాలని కోరారు. ఇందుకోసం ఆధునిక యంత్రాలకోసం సబ్సిడీ రుణాలు అందిస్తున్నామని ఆమె అన్నారు. ఇందిరాక్రాంతి పథం రుణాలు అందించేందుకు ముందుకు వచ్చిందని అన్నారు. యువకులు, రైతులు, మహిళలు కొంతమంది కలిసి బృందంగా ఏర్పడితే వారికి హైదరాబాద్‌-నిజామాబాద్‌లో శిక్షణ అందజేయడం జరుగుతుందన్నారు. నిరుపేద ఎస్సీ, ఎస్టీలకు ఉపాధి హామీ పథకం ద్వారా భూముల అభివృద్ధి చేపడుతున్నామని, ఈ భూముల్లో పండ్లు, కూరగాయలు, వాణిజ్యపంటలను పండించుకొని లాభాలు పొందాలని ఆమె సూచించారు. ఆమె వెంట కామారెడ్డి ఆర్డీఓ వెంకటేశ్వరరావు, ఎంపిడిఓ రమేష్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.