ఖానాపూర్‌లో టిఆర్‌ఎస్‌కు భారీ దెబ్బ
కాంగ్రెస్‌లో చేరిన టిఆర్‌ఎస్ నేతలు
ఆదిలాబాద్,నవంబర్20(జనంసాక్షి): ఎన్నికల వేళ నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో తెరాసకు ఎదురుదెబ్బ తగిలింది. జన్నారం మండలంలో తెరాసకు చెందిన 16 మంది మాజీ సర్పంచులు కాంగ్రెస్‌లో చేరారు. ఇక్కడికాంగ్రెస్ అభ్యర్థి రమేశ్ రాఠోడ్ జన్నారం మండలంలో ప్రచారం నిర్వహించారు. అనంతరం బాదంపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో 16 మంది సర్పంచులు రమేశ్ రాఠోడ్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఖానాపూర్‌లో తెరాస అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్.. భాజపా నుంచి సత్ల అశోక్ బరిలో ఉన్నారు. తెరాస జాబితాలో చోటు దక్కకపోవడంతో రమేశ్ రాఠోడ్ కాంగ్రెస్‌లో చేరి ఖానాపూర్ టికెట్ దక్కించుకున్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో విజయం తమ పార్టీదేనని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాథోడ్ ధీమా వ్యక్తం చేశారు. కలసికట్టుగా ప్రచారం చేసి పార్టీని గెలిపించుకుంటామన్నారు. తనకు మద్దతు తెలిపిన నేతలకు టిక్కెట్టు ఇచ్చిన అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోనూ 80కిపైగా కాంగ్రెస్ విజయం సాధిస్తుందని, ప్రభుత్వం తమదే వస్తుందన్నారు. ప్రజలు ఆలోచించి కాంగ్రెస్‌కు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.