‘ఖేడ్’ను అభివృద్ధిపథంలో నడిపిస్తాం
మెదక్,ఫిబ్రవరి 3(జనంసాక్షి): నారాయణ్‌ఖేడ్ నియోజకవర్గానికి ఏడాదిలోగా మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ మంచినీళ్లు అందిస్తామని రాష్ట్ర భారీనీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇప్పటికే చేపట్టిన ఈ పథకంతో నారాయణఖేడ్ నియోజకవర్గం గొంతు తడుపుతామని అన్నారు. ఉపఎన్నికల్లో భాగంగా నారాయణఖేడ్ మండలం తుర్కపల్లిలో మంత్రి టీఆర్‌ఎస్ అభ్యర్థి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. నారాయణఖేడ్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయగల పార్టీ టీఆర్‌ఎస్ మాత్రమేనని అన్నారు. చెప్పిన మాటను చేసే పార్టీ టీఆర్‌ఎస్ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి మాటలు ఎక్కువ, పనులు శూన్యమని వారి పాలన వల్లతేలిందన్నారు. వరంగల్, హైదరాబాద్‌లో చెల్లని కాంగ్రెస్ నారాయణఖేడ్‌లో ఎలా చెల్లుతుందన్నారు. కాంగ్రెస్ పాలన వల్లే నారాయణఖేడ్ వెనకపడి పోయిందని మంత్రి పేర్కొన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలకు సరఫరా చేసే సింగూర్ నీళ్లను సిద్దిపేట్, మెదక్ ప్రాంతాలకు తీసుకెళ్తున్నారని జహీరాబాద్ మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్ చేసిన ఆరోపణలు ఆయన అవగాహన రాహిత్యమేనని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, అన్నారు. హైదరాబాద్‌కు సరఫరా చేసే సింగూర్ నీటిని నిలిపివేసి పటాన్‌చెరువు పరిధిలోని 39 గ్రామాలకు నీటిని సరఫరా చేస్తున్నామన్నారు.. మెదక్ జిల్లాలోని ప్రజలకు తాగు, సాగు నీరందేంచేందుకు ఇప్పటికే కార్యచరణ పూర్తయిందన్నారు. గత పాలకులు తాగు, సాగు నీటికి చర్యలు తీసుకోకపోవడంతోనే ఖేడ్ ప్రజలు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. మంత్రి హరీశ్‌రావు జిల్లాకే మంత్రిగా వ్యవహరిస్తున్నారని విమర్శించడం ప్రతిపక్షాల అవివేకానికి నిదర్శనమని, మంత్రి ఆధ్వర్యంలో ఉన్న మార్కెటింగ్, నీటిపారుదల శాఖలు రాష్ట్రంలో పకడ్బందీగా పనిచేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. మిషన్ కాకతీయ పథకం రాష్ట్రానికే కాదు .. దేశంలోనే ఆదర్శంగా నిలించిందని అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో దళారీ వ్యవస్థను నిరోధించి, ప్రతి పథకాన్ని పూర్తి పారదర్శకతతో అమలు చేయడం జరుగుతుందని అందోల్ ఎమ్యెల్యే బాబుమోహన్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పలుప్రాంతాల్లో ప్రచారం చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతి పథకం దళారీల చేతుల్లోకి వెళ్లిపోవడంతో లబ్ధిదారులకు చెందాల్సిన సంక్షేమ ఫలాలు పక్కదారి పట్టాయన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ ప్రతి పథకాన్ని పకడ్బందీగా చేపడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి పూర్తిస్థాయిలో లబ్ధిచేకూరే విధంగా చర్యలు తీసుకుంటున్నారన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని మంత్రి హరీశ్‌రావు దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించినప్పుడే ఇక్కడి ప్రజల దశ మారిందని, హరీశ్‌రావు మాట ఇస్తే తప్పని వ్యక్తిత్వం గల నాయకుడన్నారు. అనతికాలంలోనే ఈ ప్రాంతం సిద్దిపేట మాదిరిగా అభివృద్ధి చెందుతుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. ఈప్రాంత అభివృద్ధి కోసం ఇక్కడి ప్రజలు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని బాబుమోహన్ కోరారు.