‘ఖేడ్’లో ఓడిపోతే రాజీనామా చేస్తా
– రేవంత్, ఉత్తమ్ మీరు సిద్ధమా?
– హరీశ్ సవాల్
మెదక్,జనవరి27(జనంసాక్షి): నారాయణ్‌ఖేడ్ ఉప ఎన్నికలో ఎన్నికల్లో ఓడిపోతే తాను రాజీనామా చేస్తానని, ఒకవేళ గెలిస్తే రేవంత్, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిలు
రాజీనామా చేయడానికి సిద్ధమేనా అని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్ రావు సవాల్ విసిరారు.ఉపఎన్నికలో గెలుపుతో నారాయణ్‌ఖేడ్ ముఖ్‌చిత్రాన్ని మారుస్తామని, సకల సౌకర్యాలు కలిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి టి.హరీష్ రావు అన్నారు. 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ నారాయణశేడ్ ఏమాత్రం అభివృద్ధి చేయలేదని చెప్పారు. మెదక్ జిల్లాలోని సిద్ధిపేట, నారాయణ్ ఖేడ్ నియోజకవర్గాలు తనకు రెండు కళ్లు అని తెలిపారు. బుధవారం మెదక్ జిల్లా కల్హేర్ మండలంలోని పలు గ్రామాల్లో మంత్రిఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఈ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే మూడేళ్లలో నారాయణ్ఖేడ్ అభివృద్ధి చేసి చూపిస్తామని వెల్లడించారు. ఈ ఉప ఎన్నికకు నామినేషన్ పక్రియ నేటితో ముగిసింది. ఫిబ్రవరి 13న ఈ ఉప ఎన్నిక జరగనుంది. అలాగే 16న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.నారాయణ్‌ఖేడ్ నియోజకవర్గ ఉపఎన్నికలో అణచివేతకు, అభివృద్ధికి మధ్య పోరాటమని మంత్రి అన్నారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్ అభ్యర్థి భూపాల్‌రెడ్డి తరపున మంత్రి ప్రచారంలో పాల్గొన్నారు. కల్హేర్ మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించిన మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నారాయణ్‌ఖేడ్ ఉప ఎన్నిక అణచివేతకు, అభివృద్ధికి మధ్య పోరాటంగా అబివర్ణించారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే నారాయణఖేడ్ అభివృద్ధిలో వెనుకబడిందన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపించి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఆయన పేర్కొన్నారు. పూర్తిగా వెనుకబడిన నారాయణఖేడ్ నియోజకవర్గం దశదిశ మార్చాలన్న లక్ష్యంతో పార్టీ ఉప ఎన్నిక బరిలో నిలిచిందని అన్నారు. అనుకోని సంఘటన కారణంగా ఉప ఎన్నిక వచ్చిందని ఇక్కడ ఏకగ్రీవం ప్రతిపాదనలు వచ్చినా సీఎం ఇక్కడి పరిస్థితులను చూసి తెరాసతోనే ఇక్కడ అభివృద్ధి సాధ్యమనే భావనతో బరిలో పార్టీని ఉంచారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఖేడ్‌లో రాచరిక పాలన కొనసాగుతూ వచ్చిందని తెరాసతో నిజమైన ప్రజాస్వామ్య పాలన అందిస్తామని అన్నారు. ఇన్నేళ్లూ పాలించిన కాంగ్రెస్ పెద్దలు ఇప్పటి వరకు ఖేడ్ నియోజకవర్గంలోని మండలాల్లో పర్యటించ లేదని ఇప్పుడు వారికి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. ఇక్కడి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఇప్పటి వరకు వారిని వెనుకబాటుకు గురిచేసిన నాయకులకు ఓట్లతో సరైన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.