‘ఖేడ్‌’లో గెలుపు మాదే

3

– మంత్రి హరీశ్‌ రావు

మెదక్‌,జనవరి28(జనంసాక్షి): నారాయణఖేడ్‌ అసెంబ్లీ స్థానాన్ని టీఆర్‌ఎస్‌ గెలిచి తీరుతుందని మంత్రి హరీష్‌ రావు ధీమా వ్యక్తం చేశారు. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న అబివృద్ది, సంక్షేమకార్యక్రమాలు, ముఖ్యమంత్రి కెసిఆర్‌ నాయకత్వం కారణంగా ప్రజలు  టీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపిస్తున్నారని అన్నారు. మెదక్‌ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇందుకు దోహదపడుతున్నాయన్నారు. కాంగ్రెస్‌,టిడిపిలు ఓడితే జానారెడ్డి, రేవంత్‌రెడ్డిలు తమ పదవులకు రాజీనామా చేస్తరా అని మంత్రి హరీశ్‌రావు సవాలు విసిరారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి భూపాల్‌రెడ్డి తరపున మంత్రి హరీష్‌రావు, ఎంపీ బీబీపాటిల్‌లు గురువారం నారాయణఖేడ్‌లోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. నారాయణఖేడ్‌ నియోజకవర్గ అభివృద్ధికి రూ. 500 కోట్ల నిధులు విడుదల చేశామని అన్నారు.  ఓటమి బయంతోనే కాంగ్రెస్‌, టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.  నియోజకవర్గంలో ఇంటింటికి నల్లానీరు అందించడానికి వాటర్‌ గ్రిడ్‌ చేపట్టామని అన్నారు. . నారాయణఖేడ్‌ అసెంబ్లీ స్థానాన్ని టీఆర్‌ఎస్‌ గెలిచి తీరుతామని, టీఆర్‌ఎస్‌ గెలిస్తే జానారెడ్డి, రేవంత్‌రెడ్డి రాజీనామా చేస్తరా అని ప్రశ్నించారు. అన్ని రంగాల్లో నారాయణఖేడ్‌ను అభివృద్ధి పరుస్తమని మంత్రి పేర్కొన్నారు. అలాగే నారాయణఖేడ్‌ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ ఓడిపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మరోమారు ప్రకటించారు.  ఈ సవాల్‌ను స్వీకరించి కాంగ్రెస్‌ ఓడితే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవికి, టీడీపీ ఓడితే రేవంత్‌రెడ్డి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవికి రాజీనామా చేస్తారా? అని సవాల్‌ విసిరారు.  ఉప ఎన్నికలో కాంగ్రెస్‌, టీడీపీలు ఉనికికోసమే పోటీ చేస్తున్నాయన్నారు. ఓడిపోతామనే భయంతోనే కాంగ్రెస్‌, టీడీపీ నేతలు పిచ్చిప్రేలాపనలు చేస్తున్నారన్నారు. వరంగల్‌ ఎంపీ ఉప ఎన్నికలోనూ టీఆర్‌ఎస్‌పై  విమర్శలు చేసిన ప్రతిపక్షాలకు.. అక్కడి ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టినా గుణపాఠం

నేర్చుకోలేదన్నారు. నారాయణఖేడ్‌ ప్రజలు సైతం ఉప ఎన్నికలో కాంగ్రెస్‌, టీడీపీలకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇక్కడ టిఆర్‌ఎస్‌లోకి చేరికలు కూడా జోరుగా సాగాయి. గత రెండు, మూడు నెలల కాలంలో కాంగ్రెస్‌, టీడీపీలకు చెందిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ఇతర ముఖ్యనాయకులంతా ఇతర పార్టీల నుంచి మంత్రి హరీశ్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యకర్తలు కూడా వేలాది మంది టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు .ఇదిలావుంటే నారాయణఖేడ్‌ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికకు బుధవారంతో నామినేషన్ల పక్రియ ముగిసింది. ప్రధానంగా టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలకు చెందిన ముగ్గురు అభ్యర్థులతో సహా మొత్తం 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ నెల 30 వరకు నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఉంది. నారాయణఖేడ్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలకు మొత్తం 12 నామినేషన్లు, 26సెట్లు దాఖలు అయినట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి వాసం వెంకటేశ్వర్లు తెలిపారు. ఇందులో భాగంగా టీఆర్‌ఎస్‌ నుంచి మహారెడ్డి భూపాల్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి పట్లోళ్ల సంజీవ్‌రెడ్డి, టీడీపీ నుంచి మహారెడ్డి విజయపాల్‌రెడ్డి, ఎంసీపీఐ(యు) నుంచి తుకారాంనాయక్‌, ఎంఐఎం నుంచి యూనుస్‌, శ్రమజీవి పార్టీ నుంచి జాజుల భాస్కర్‌, టీడీపీ డమ్మి అభ్యర్థిగా మారుతిరెడ్డి, స్వాతంత్య అభ్యర్థిగా మురళీగోవింద్‌, వెంకటేశం, ఇటిక్యాల మాదప్ప, బోరంచ సంగారెడ్డి, సుంకలి లింగయ్య నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలిపారు. 28న నామినేషన్ల పరిశీలన, 30న నామినేషన్ల ఉప సంహరణ ఉంటుందని రిటర్నింగ్‌ అధికారి పేర్కొన్నారు.