ఖేడ్‌లో వెల్లువిరిసిన ఓటరు చైతన్యం
– 82.65 శాతం పోలింగ్
మెదక్,ఫిబ్రవరి 13(జనంసాక్షి): మెదక్ జిల్లా నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 82.75 శాతం పోలింగ్ నమోదైనట్టు జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్ ప్రకటించారు. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కేంద్రాల్లో క్యూలో ఉన్న ఓటర్లందరికి ఓటు వేసే అవకాశం కల్పించారు. పోలింగ్ ప్రక్రియనంతా అధికారులు వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించారు. మొత్తం 286 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరిగింది. మొత్తం 1,88,839 ఓటర్లుండగా వారిలో పురుషులు 95,772, మహిళలు 93,040 మంది ఉన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గంలో 77 శాతం పోలింగ్ నమోదైంది. గతంలో కంటే ఓటింగ్ శాతం పెరిగిందని కలెక్టర్ తెలిపారు. రాత్రి 9 గంటలకల్లా ఈవీఎంలను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరుస్తామని అన్నారు. ఈ నెల 16న కౌంటింగ్ జరుగుతుంది.
నారాయణఖేడ్ నియోజకవర్గం ఓటర్లకు కృతజ్ఞతలు: హరీష్‌రావు
మెదక్ జిల్లా నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్లందరికి మంత్రి హరీష్ రావు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు. ఇవాళ జరిగిన ఉప ఎన్నికలో ఖేడ్ ప్రజలకు కొత్త చరిత్ర లిఖించారని కొనియాడారు. ఓటర్లు చైతన్యాన్ని ప్రదర్శించి గతంలో ఎన్నడూ లేనివిధంగా అత్యధిక మంది ఓట్లు వేయడం ద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారని ప్రశంసించారు. గ్రావిూణ ప్రాంత ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొని తమ ప్రతినిధిని ఎన్నుకునే ప్రక్రియలో భాగస్వాములయ్యారని అన్నారు. నారాయణఖేడ్ లో ఎన్నికలంటేనే గతంలో ప్రజలు భయపడేవాళ్లని, ఘర్షణల మధ్యనే ఓట్లు వేయాల్సి వచ్చేదని మంత్రి హరీష్ రావు గుర్తుచేశారు. కానీ, ఈసారి ప్రశాంత వాతావరణంలో తమ ఓటుహక్కుని వినియోగించుకున్నారని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక వ్యూహం, ప్రణాళికతో పనిచేసిన జిల్లా కలెక్టర్, ఎస్పీ, అధికార యంత్రాంగానికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకోవడం సహజమని హరీష్ రావు అన్నారు. అందరి మాటలను విన్న ప్రజలు ఇవాళ పెద్ద సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొన్నారని చెప్పారు. వారిచ్చే తీర్పుని శిరోధార్యంగా భావించి గౌరవించడానికి టిఆర్‌ఎస్ సిద్ధంగా ఉందని, మిగిలిన పార్టీలు కూడా ఇదే స్ఫూర్తిని కనబరుస్తాయని ఆశిస్తున్నానని అన్నారు. ఫలితాలు వచ్చిన మరుక్షణం నుంచి నారాయణఖేడ్ అభివృద్ధికి కంకణబద్ధుడనై పనిచేస్తానని హరీష్ రావు మాటిచ్చారు. అభివృద్ధి కోసం ఇతర రాజకీయ పార్టీలు కూడా కలిసి రావాలని ఆహ్వానించారు.