ఖేల్‌రత్నకు కోహ్లీ, విూరాబాయి చాను
– అవార్డుకు సిఫార్సు చేసిన సెలక్షన్ కమిటీ
న్యూఢిల్లీ, సెప్టెంబర్17(జనంసాక్షి): భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ, వెయిట్ లిఫ్టింగ్ ప్రపంచ ఛాంపియన్ విూరాబాయి చాను పేర్లను ఈ ఏడాది రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న అవార్డుకు సిఫార్సు చేశారు. ఈ మేరకు అవార్డుల సెలక్షన్ కమిటీ వర్గాలు విూడియాకు తెలిపాయి. టీమిండియా కెప్టెన్, ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్‌లో నంబర్ వన్ బ్యాట్స్‌మన్ అయిన కోహ్లీ పేరును 2016లో ఖేల్‌రత్న అవార్డు కోసం పరిశీలించారు. అయితే అప్పుడు సెలక్షన్ కమిటీ ఆయన పేరును పక్కనబెట్టింది. తాజాగా మరోసారి కోహ్లీ పేరును బీసీసీఐ నామినేట్ చేసింది. ఈసారి సెలక్షన్ కమిటీ కూడా కోహ్లీని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్ కూడా ఆమోదం తెలిపితే.. ఈ అత్యున్నత పురస్కారం అందుకునే మూడో క్రికెటర్‌గా కోహ్లీ నిలుస్తారు. ఇప్పటివరకు 1997లో క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్, 2007లో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఖేల్‌రత్న అందుకున్నారు. ఇక గతేడాది ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 48కేజీల విభాగంలో స్వర్ణం సాధించిన వెయిట్‌లిఫ్టర్ విూరాబాయి చాను పేరును కూడా కోహ్లీ పేరుతో పాటు సెలక్షన్ కమిటీ సిఫార్సు చేసింది. ఈ ఏడాది కామన్వెల్త్ గేమ్స్‌లోనూ పసిడి పతకం సాధించిన చాను.. గాయం కారణంగా ఇటీవల జరిగిన ఏషియన్ గేమ్స్‌లో పాల్గొనలేదు. కాగా.. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ పేరును కూడా ఖేల్‌రత్న పురస్కారానికి పరిశీలిస్తున్నట్లు సమాచారం.