గంగూలీ రికార్డును బద్దలు కొట్టిన ఎంఎస్ ధోనీ

పెర్త్: టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరో రికార్డు సృష్టించాడు. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నేతృత్వంలో భారత్ అందుకున్న విజయాల రికార్డును ధోనీ బద్దలుకొట్టాడు. భారత జట్టుకు విదేశాల్లో అత్యధిక వన్డే మ్యాచుల విజయాలు అందించిన కెప్టెన్‌గా ధోనీ తన పేరును నమోదు చేసుకున్నాడు. శుక్రవారం ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచులో నాలుగు వికెట్ల తేడాతో టీమిండియా గెలిచిన విషయం తెలిసిందే. ఈ విజయంతో ధోనీ.. గంగూలీ పేరున ఉన్న అత్యధిక విజయాల రికార్డును బద్దలు కొట్టాడు. ఈ విజయంతో ధోనీ నేతృత్వంలో భారత్ 59 విజయాలను అందుకుంది. కాగా, గంగూలీ 58 విజయాలను భారత్‌కు అందించాడు. గంగూలీ రికార్డును బద్దలు కొట్టిన ఎంఎస్ ధోనీ విండీస్‌తో జరిగిన మ్యాచులో ధోనీ 45 పరుగులతో అజేయంగా నిలిచి భారత్‌కు విజయాన్నందించాడు. ఒక దశలో ఓటమి దిశగా సాగుతున్న టీమిండియాను గెలుపు దిశగా నడిపించాడు. ధోనీ నాయకత్వంలో భారత్ 2007లో ప్రపంచ టి20, 2011లో వన్డే ప్రపంచ కప్, ఇంగ్లాండ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలను గెలుచుకుంది. టీమిండియాను టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నిలబెట్టిన ఘనత కూడా ధోనీకే దక్కుతుంది.