గందమళ్ల ప్రాజెక్టును పూర్తి చేయిస్తా
చెరువు కబ్జా చేస్తే వదిలి పెట్టం: ఉత్తమ్
యాదాద్రి భువనగిరి(జనంసాక్షి):గందమళ్ల ప్రాజెక్టునుమంజూరు చేసి పూర్తి చేయిస్తానని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిఅన్నారు. నా శక్తి మేరకు భువనగిరి పార్లమెంట్ పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తాను. యాదాద్రి భువనగిరిలో భువనగిరి పార్లమెంట్ స్థాయి నీటి పారుదల పనులపై సవిూక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసి భువనగిరి పార్లమెంట్ లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తానని పేర్కొన్నారు. ఎంతటి వారైనా చెరువు కబ్జా చేస్తే వదిలి పెట్టమని స్పష్టం చేశారు. భునియదిగాని, పిల్లయిపల్లి, దర్మారెడ్డి పల్లి కాలువలకు ఎన్ని నిధులైనా ఖర్చు చేసి పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్న విప్ బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్యేలు కుంభం అనిల్, వేముల వీరేశం, మందుల సామెల్, రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి గారూ అని సంభోదించారు. అంతేకాదు.. తన నాలుకపై నల్లటి మచ్చలు ఉన్నాయని.. తాను ఏమి అంటే అది జరిగి తీరుతుందన్నారు. ఈ విషయాన్ని తన అమ్మ చెప్పిందన్నారు కోమటిరెడ్డి. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకసారి భవిష్యత్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి తప్పక అవుతారని చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ ఇప్పుడు కాంగ్రెస్‌లో సంచలనంగా మారాయి. కాగా, శుక్రవారం నాడు భువనగిరి న్యూ డైమన్షన్ స్కూల్‌లో పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి నీటిపారుదల శాఖ పనులపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవిూక్షా సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం భువనగిరి మండలం అనాజీపురం శివారులోని బూనాది గాని కాల్వను మంత్రులు ఉత్తమ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు పరిశీలించారు. కాల్వ పరిస్థితిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక బునాదిగాని పిల్లయిపల్లి ధర్మారెడ్డి కాలువలను రీ డిజైన్ చేయాలని కోరారు. కాలువల వెడల్పు పెంచాలి.. దీని ద్వారా ఆయకట్టు డబుల్ అవుతుందన్నారు. అధికారులు కాగితాలపై కాకుండా దూరదృష్టితో ప్రతిపాదనలు పంపాలని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆదేశించారు.