గణతంత్ర వేడుకలకు అతిథిగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు కిరిల్‌?

కేంద్రం ప్రయత్‌ఇస్తున్నట్లు సమాచారం

ట్రంప్‌ తిరస్కరణతో తాజా యత్నం

న్యూఢిల్లీ,నవంబర్‌10(జ‌నంసాక్షి): వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవానికి దక్షిణాఫ్రికా అధ్యక్షుడు కిరిల్‌ రమఫోసాను అతిథిగా పిలిచే విషయాన్ని కేంద్రం ఆలోచిస్తున్నట్లు సమాచారం. గణతంత్ర వేడుకలకు

రాలేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెప్పడంతో మరో అతిథి కోసం అన్వేషిస్తోంది. ఈసారి ఆఫ్రికా దేశాధినేతను ముఖ్య అతిథిగా పిలవాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు కిరిల్‌ రమఫోసాను గణతంత్ర వేడుకలకు ఆహ్వానించే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుందని సదరు వర్గాలు వెల్లడించాయి. జనవరి 26న జరిగే గణతంత్ర వేడుకలకు హాజరుకావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను భారత ప్రభుత్వం ఆహ్వానించింది. అయితే ఆ సమయంలో ఊపిరిసలపని పనులు ఉండటంతో ట్రంప్‌ వేడుకలకు రాలేరని తెలిపినట్లు వార్తలు వచ్చాయి. దీంతో మరో అతిథిని ఆహ్వానించేందుకు ప్రభుత్వం అన్వేషణ మొదలుపెట్టింది. మొత్తం నలుగురు ప్రముఖుల పేర్లను పరిగణనలోకి తీసుకోగా.. వీరిలో దక్షిణాఫ్రికా దేశాధ్యక్షుడి పేరు ఖరారు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. త్వరలోనే ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. గత ఆరేళ్లుగా ప్రపంచ దేశాలకు చెందిన ప్రముఖ నేతలు మన గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. 2013లో భూటాన్‌ రాజు జిగ్మే ఖేసర్‌ నంగ్యేల్‌ వాంగ్‌చుక్‌, 2014లో జపాన్‌ ప్రధాని షింజో అబే, 2015లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, 2016లో అప్పటి ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఫ్రాన్స్‌వో ¬లన్‌, 2017లో యూఏఈ యువరాజు మహ్మద్‌ బిన్‌ జయేద్‌ అల్‌ నయన్‌, గతేడాది ఆసియాన్‌ దేశాధినేతలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇప్పటివరకు దక్షిణ అమెరికా, ఆఫ్రికా దేశాల నుంచే ఏ నేత గణతంత్ర వేడుకలకు రాలేదు. దీంతో ఈసారి దక్షిణాఫ్రికా దేశాధ్యక్షుడు కిరిల్‌ను ఆహ్వానించాలని ప్రభుత్వం భావిస్తోందని, అయితే అయితే దీనిపై విదేశాంగ శాఖ నుంచి ప్రకటన రావాల్సి ఉంది.