గణపతి నిమార్జన కార్యక్రమాలు శాంతియుతంగా చేసుకోవాలి -ఎస్సై బాణోత్ వెంకన్న
మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్2(జనంసాక్షి)
గణపతి నిమర్జన కార్యక్రమాలు శాంతియుతంగా నిర్వహించుకోవాలని గార్ల ఎస్సై బాణోత్ వెంకన్న అన్నారు. శుక్రవారం స్థానిక ఏవిఆర్ ఫంక్షన్ హాలులో మండలంలో అన్నిగ్రామాల కమిటీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి నవరాత్రి పూజలు, నిమర్జన కార్యక్రమాలపై వారికి పలు సూచనలు చేసి జాగ్రత్తలు చెప్పారు. అందులో భాగంగానే ప్రతి ఒక్క కమిటీ వారి మండపానికి సంబంధిత జాగ్రత్తలు పాటిస్తూ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, సౌండ్ పర్మిషన్, కరెంట్ పర్మిషన్ తీసుకోవాలన్నారు. భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకోవాలని ఎవరికి ఇబ్బంది కల్పించొద్దన్నారు. నిమర్జన వేడుకలను అందరూ శాంతియుతంగా శనివారం నిర్వహించుకోవాలని, నిమార్జనానికి ఎటువంటి డీజే లకు అనుమతులు లేవని నిమార్జన వేడుకలలో మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించవద్దని తెలిపారు. లడ్డు పాటకు ఘాట్ వద్ద అనుమతి లేదని అందరూ ముందురోజు సాయంత్రం 4గంటలనుండి 6గంటలవరకు ఎవరి మండపం వద్ద వారే పాటను నిర్వహించుకోవాలన్నారు. ఎటువంటి అవాంఛనీయ కార్యకలాపాలకు పాల్పడ్డా ఎవరిని ఇబ్బంది పరచే విధంగా ప్రవర్తించినా ఘర్షణలకు పాల్పడ్డా కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు. మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అజ్మీరా బన్సీలాల్ మాట్లాడుతూ గణపతి నిమార్జనానికి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపి గజఈతగాళ్ళతో క్రేన్ ఏర్పాటు చేస్తున్నామని నిమర్జన కార్యక్రమానికి అందరూ సహకరించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శీలంశెట్టి రమేష్, తహశీల్దార్ రాము, ఎంపీడీఓ రవీందర్, పోలీసు సిబ్బంది, గణపతి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.