” గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి – సైబరాబాద్ పోలీస్ బాస్ స్టీఫెన్ రవీంద్ర”

శేరిలింగంప‌ల్లి, ఆగస్టు 19( జనంసాక్షి): భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రత్యేకగా నిలిచే గణేష్ నవరాత్రి మహోత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవడం ద్వారా పండుగకు మరింత శోభను అందించాలని సైబరాబాద్ పోలీస్ బాస్ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. ఈనెల 31వ తేదీన ప్రారంభమయ్యే గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని సైబరాబాద్ కమిషనర్ కార్యాలయం వివిధ పోలీసు ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలను మేళవిస్తూ భారతీయ పండుగలు జరుగుతుంటాయని, ఇందులో గణేష్ నవరాత్రి ఉత్సవాలకు మరింత ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గణేష్ ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతుంటాయని, కుల మతాలకతీతంగా, మతసామరస్యం వెల్లివిరిసేలా అన్ని వర్గాల ప్రజలు పండుగలు జరుపుకోవడం హైదరాబాద్ ప్రత్యేకత అని సిపి తెలిపారు.
 వినాయక చవితి ఉత్సవాలు ఈ నెల 31వ తేదీన ప్రారంభమై సెప్టెంబర్ 9 వరకు కొనసాగనున్నాయని, అనంతరం నిర్వహించబోయే నిమజ్జన కార్యక్రమానికిసైతం ఏర్పాట్లను జాగ్రత్తగా పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. నిమజ్జనానికి సంబంధించిన భద్రతాయేర్పాట్లు పకడ్బందీగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు అధికారులంతా అప్రమత్తతతో ఉండాలన్నారు. ఇప్పటివరకు జరిగిన అన్ని మతాలకు చెందిన పండుగలు, వేడుకలు ఇతర కార్యక్రమాలు సాఫీగా జరిగాయని, తద్వారా నగరంలోని మూడు కమిషనరేట్లపట్ల ప్రజలలో గట్టినమ్మకం కలిగిందన్నారు. దేశంలో ప్రతి ఏటా నిర్వహించుకునే ఉత్సవాలలో వినాయకచవితి నవరాత్రులు అతిపెద్దదని, దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని శాంతియుత వాతావరణంలో గుణించాల్సిన బాధ్యత పోలీస్ అధికారులుగా తమపై ఉందన్నారు. గణేష్ విగ్రహాల ప్రతిష్టాపన విషయంలో నిర్వాహకులతో అందరు ఇన్స్పెక్టర్లు ముందుగానే సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించాలన్నారు. గణేష్ వేడుకల్లో శాంతిభద్రతల్లో ఎక్కడా సమస్యని రానివ్వవద్దని, ఈ విషయంలో అందరూ సమిష్టిగా కృషి చేయాలన్నారు. ఇందులో భాగంగా ఆయాప్రాంతాల్లోని పౌరవిభాగాలతో సమన్వయం చేసుకోవాలని, వారి సహకారంతో పండుగను మరింత ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవడానికి సులువవుతుందన్నారు. సైబరాబాద్ పోలీస్ అధికారలంతా జీహెచ్ఎంసీ, టీఎస్ఎస్పీడీసీఎల్, ఆర్ అండ్ బీ, ట్రాన్స్ కో, ట్రాన్స్ పోర్ట్, ఇరిగేషన్, ఫైర్ సర్వీసెస్, హెల్త్ డిపార్ట్ మెంట్ తదితర శాఖల అధికారులు, భాగ్య నగర్ గణేశ్ ఉత్సవ సమితి సభ్యులకు, ప్రజలు, మీడియాకు, గణేష్ మండల నిర్వాహకులతో కలిసి సమన్వయం చేసుకుంటూ శాంతియుతంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను జరుపుకునేలా చూడాలన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను ప్రజలు నమ్మవద్దని, సోషల్ మీడియా తప్పుడు పోస్టులపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. ఈసమావేశంలో సైబరాబాద్ జాయింట్ సీపీ అవినాష్ మహంతి, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ రావు, మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, బాలానగర్ డీసీపీ సందీప్, శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, అడ్మిన్ డీసీపీ ఇందిర, డబ్ల్యూ& సియస్డబ్ల్యూ డీసీపీ శ్రీమతి కవిత, ఎస్బీ ఏడీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు ఇతర పోలీసు సిబ్బంది ఉన్నారు.