గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి
_ మందమర్రి సిఐ ప్రమోద్ రావు
గణపతి ఉత్సవ కమిటీలు, శాంతి కమిటీ సమావేశం
సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన మందమర్రి మండలం రామకృష్ణాపూర్ లోని అన్ని పండుగలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేందుకు కలసికట్టుగా పట్టణ ప్రజలు కొనసాగిస్తున్న తీరు, ఘనత అద్భుతమని మందమర్రి సిఐ ప్రమోదరావు కొనియాడారు. శనివారం స్థానిక అర్ కే సి ఓ ఏ క్లబ్ నందు గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు, వివిధ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సమక్షంలో మందమర్రి సిఐ ప్రమోద్ రావు అధ్యక్షతన శాంతి కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు ఉత్సవ సమితి సభ్యులు తమ సూచనలు, అభిప్రాయాలు తెలియజేశారు, రోడ్ల మరమ్మత్తులు, విద్యుత్తు, శోభాయాత్ర సమయంలో ఉండే సమస్యలపై చర్చించారు. పండుగలను సామరస్యంగా నిర్వహించుకుందామని, పోలీసులకు అన్ని విధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మందమర్రి సిఐ మాట్లాడుతూ ప్రతి ఒక్క గణేష్ మండలి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అదేవిధంగా రాత్రిపూట కచ్చితంగా గణేష్ మండపం వద్ద ఇద్దరు కమిటీ సభ్యులు కానీ వాలంటీర్లు గాని ఉండే విధంగా చూసుకోవాలని తెలియజేశారు. శోభాయాత్ర సమయంలో ఎక్కువగా శబ్దం వచ్చే డీజే లకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ మండప వివరాలను, శోభాయాత్ర, నిమజ్జనం, మండప సభ్యులు, కమిటీ సభ్యులు, తదితర వివరాలను వెబ్సైట్లో పొందుపరిచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి స్థానిక మత పెద్దలు, శాంతి కమిటీ సభ్యులు, స్వచ్ఛంద సేవకులు, యువజన సంఘాలు, గణేష్ మండలి నిర్వాహకులు పోలీసులకు ఎల్లవేళలా సహకరించాలని కోరారు. గణేష్ ఉత్సవ కార్యక్రమం నిర్వహించడానికి రెండు మూడు రోజుల తర్వాత ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా కమిటీ సభ్యులు సూచించిన కొన్ని సూచనలను క్యాతన్ పల్లి మున్సిపాలిటీ, వివిధ శాఖల సమన్వయంతో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తూ, నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పట్టణంలో పోలీసులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని ఎటువంటి అత్యవసర సమయంలోనైనా డయల్ 100 కు సంప్రదించవచ్చునని, ఫోన్ చేసిన ఐదు నిమిషాల లోపు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్యాతన్ పల్లి మున్సిపాలిటీ చైర్ పర్సన్ జంగం కళ, మున్సిపాలిటీ కమిషనర్ వెంకట్ నారాయణ, పట్టణ ఎస్సై బి అశోక్ , గణపతి మండప కమిటీ సభ్యులు, వివిధ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంస్థల నాయకులు తదితరులు పాల్గొన్నారు.