గవర్నర్ జీ.. ఉత్సవాలకు రండి
తెలంగాణ ఆవిర్భావ వారోత్సవాలకు ఆహ్వానించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్,జూన్5(జనంసాక్షి): తెలంగాణ ఆవిర్భావ ముగింపు ఉత్సవాలకు గవర్నర్ నరసింహన్‌ను సిఎం కెసిఆర్ ఆహ్వానించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శుక్రవారం గవర్నర్ నరసింహన్‌తో సమావేశమయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం కేసీఆర్ రాజ్‌భవన్ వెళ్లి నరసింహన్ను కలిశారు. ఈ సందర్భంగా ముగింపు ఉత్సవాల్లో పాల్గొనాలని కోరారు. అలాగే తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు కేసు విషయం కేసీఆర్ గవర్నర్‌తో చర్చించి ఉంటారని టిఆర్‌ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్కు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ముడుపులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న సంగతి తెలిసిందే. అంతకుముందు స్టీఫెన్‌తో టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారని, ఇందుకు సంబంధించి ఆడియో రికార్డులు ఉన్నాయని తెలంగాణ ¬ం మంత్రి నాయిని నరసింహారెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ గవర్నర్‌తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.సీఎం కేసీఆర్‌తోపాటు నిఘా విభాగం అధిపతి శివధర్‌రెడ్డి, ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఏకే ఖాన్ కూడా గవర్నర్‌ను కలిసిన వారిలోఉన్నారు. రేవంత్‌రెడ్డి వ్యవహారంపైనే ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. రేవంత్‌రెడ్డి వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటినుంచి దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టిన కేసీఆర్ ఇందులో భాగంగానే గవర్నర్‌తో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. ఈ వ్యవహారంపై నిన్న తెలంగాణ ¬ంమంత్రి నాయిని చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం సృష్టించాయి. ఈ కేసుపై కొద్ది రోజుల్లో టేపులు బయటకు వస్తాయని, అందులో చంద్రబాబు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని వాటి వల్ల రెండు రాష్టాల్ర రాజకీయాలపై ప్రభావం చూపుతాయని వ్యాఖ్యానించారు. దీంతో చంద్రబాబుపై కేసు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ వ్యవహారాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశంతోనే ఈరోజు కేసీఆర్ సమావేశమైనట్లు తెలియవచ్చింది. అయితే తెలంగాణ ఆవిర్భావ ముగింపు ఉత్సవాలకు ఆహ్వానించేందుకే గవర్నర్‌ను కలిసేందుకు వెళ్లారని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.