గవర్నర్ జోక్యం చేసుకోవాలి
– మజ్లిస్ దాడులను ఖండించిన అఖిలపక్షం
హైదరాబాద్,ఫిబ్రవరి 3(జనంసాక్షి): విభజన చట్టంలోని సెక్షన్ ఎనిమిది కింద గవర్నర్ తనకున్న విశేషాధికారాలను ఉపయోగించి శాంతిభద్రల విషయంలో చర్యలు చేపట్టాలని తెలంగాణ శాసనసభ విపక్ష నేత కె.జానారెడ్డి డిమాండ్ చేశారు. దీనిపై గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా పాతబస్తీలో జరిగిన ఘటనలపై తెలంగాణ రాజకీయ పక్షాలు గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశాయి. ఎంఐఎం కార్యకర్తలు కాంగ్రెస్ నేతలపై దాడికి పాల్పడ్డారని… దీనికి బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే మూడు డివిజన్‌ల్లో రీ పోలింగ్ జరపాలని కోరారు. గవర్నర్ కలిసిన వారిలో కాంగ్రెస్, తెదేపా, భాజపా నేతలు ఉన్నారు. పాతబస్తీ లో ఎంఐఎం నేత అసదుద్దీన్ ,ఆయన పార్టీ కార్యకర్తలు దౌర్జన్యాలకు పాల్పడ్డారని జానారెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో శాంతి భద్రతలు విఫలం అయ్యాయని , ఈ విషయాన్ని గుర్తించాలని జానారెడ్డి అన్నారు. విభజన చట్టంలోని సెక్షన్ ఎనిమిది కింద గవర్నర్ అధికారాలు చేపట్టవచ్చని అన్నారు. మంగళవారం దాడి ఘటనల నేపథ్యంలో కాంగ్రెస్ ఆద్వర్యంలో జరిగిన అఖిలపక్షం సమావేశంలో బిజెపి,టిడిపి తదితర పక్షాల నేతలు పాల్గొని ప్రభుత్వ తీరును తప్పు పట్టారు. బిజెపి నేత లక్ష్మణ్, టిడిపి నేత ఎల్.రమణ తదితరులు టిఆర్‌ఎస్ ,ఎంఐఎంల తీరును విమర్శించాయి. పాతబస్తీలో ఎంఐఎం, కొత్తసిటీలో టీఆర్‌ఎస్ పార్టీలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నాయని కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, శాసనసభలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ, ఇతర పార్టీల అభ్యుర్ధులపై దాడి ఇందుకు నిదర్శనమని అఖిలపక్ష నేతలు జానారెడ్డి, లక్ష్మణ్, ఎల్ రమణ, శివకుమార్ ధ్వజమెత్తారు. మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం కార్యకర్తలను తక్షణమే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. శాంతి భద్రతల అదుపులో ప్రభుత్వం విఫలమైందన్నారు. తక్షణం గవర్నర్ నరసింహన్ జోక్యం చేసుకుని సెక్షన్ 8 అమలు చేయాలన్నారు. హైదరాబాద్‌లో శాంతి భద్రతలను పరిరక్షించాలని కోరారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, ¬ంమంత్రి రాజ్ నాథ్ సింగ్ లను కలిసి రాష్ట్ర పరిస్థితులను వివరిస్తామని అఖిలపక్ష నేతలు జానారెడ్డి, లక్ష్మణ్, ఎల్ రమణ, శివకుమార్ తెలిపారు. ఇదిలావుంటే అఖిలపక్ష నేతలు బుధవారం ఎలక్షన్ కమిషనర్ నాగిరెడ్డిని కలిశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పలు డివిజన్లలో రిగ్గింగ్ జరిగిందంటూ వారు ఈ సందర్భంగా ఎలక్షన్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. గొడవలు జరిగిన ప్రాంతాల్లో రీ పోలింగ్ నిర్వహించాలని అఖిలపక్ష నేతలు విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఇదే అంశంపై అఖిలపక్ష నేతలు జానారెడ్డి, లక్ష్మణ్, రమణ, శివకుమార్ తదితరులు గవర్నర్ నరసింహన్ను కలవనున్నారు. ఇకపోతే పాతబస్తీలో మజ్లిస్ పార్టీ నేతలు ఉగ్రవాదుల్లా వ్యవహరించారని, ఆ పార్టీని పెంచి పోషించిన కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి వచ్చిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు బుధవారం నాడు ఆవేదన వ్యక్తం చేశారు. పాతబస్తీని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మజ్లిస్ పార్టీకి ఏమైనా రాసిచ్చారా అని ప్రశ్నించారు. మజ్లిస్ పార్టీకి మద్దతు ఇవ్వడం అంటే పాముకు పాలు పోసి పెంచినట్లేనని అన్నారు. మజ్లిస్‌కు ఇన్నాళ్లు అండగా ఉన్న తమకు తగిన బుద్ధి వచ్చిందన్నారు. మేం మోసపోయామన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ మేలుకోవాలన్నారు. పాతబస్తీ మజ్లిస్ అయ్య జాగీరా అన్నారు. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ దగ్గరుండి కొట్టించడం ఏమిటన్నారు. అసద్ ఓ ఎంపీ అనే విషయం మర్చిపోతున్నాడా అన్నారు. కెసిఆర్! మజ్లిస్‌తో దోస్తీ చేసి మేం మోసపోయామని, విూరు మోసపోవద్దన్నారు.
మజ్లిస్ దాడులతో బెదరించాలని చూస్తోంది : షబ్బీర్
మజ్లిస్ దాడులతో కాంగ్రెస్‌ను అడ్డుకోవాలని చూస్తోందని తెలంగాణ శాసనమండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ అన్నారు. కాంగరెస్ ఎదుగలతో ఠారెత్తిన ఎఐఎం అధికార పార్టీ అండతో తనపై దాడికి దిగిందన్నారు. తనపై దాడి చేసిన ఘటనపై అసదుద్దీన్ ఒవైసీ అబద్దాలు ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. తమపై అసద్ తో వచ్చిన మాబ్ దాడి చేసిందని అసద్ అసత్యాలు చెబుతున్నారని ఆయన అన్నారు. హైదరాబాద్ పాతబస్తీలో తనకు ఎదురైన అనుభవాన్ని,తనపై జరిగిన దాడి గురించి పోటోలతో సహా వివరించారు. అసదుద్దీన్ ,ఆయన సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీలపై కిరణ్ హయాంలో కేసులు నమోదు అయ్యాయని, ఒక మతానికి వ్యతిరేకంగా మాట్లాడడంతో ఆ కేసులు వచ్చాయని షబ్బీర్ చెప్పారు. అప్పటి నుంచి కాంగ్రెస్ అంటే అతను ద్వేషం పెంచుకున్నాడని అన్నారు. పాత బస్తీ తన ఇలాఖా అని అసద్ అంటున్నారని, ప్రజాస్వామ్యంలో ఇతరులు ఎవరూ రాకూడదని ఒక నాయకుడు చెప్పడం కుదురుతుందా అని ఆయన ప్రశ్నించారు. తనపై ఒక వ్యక్తి దాడి చేస్తున్న పోటోలను ,ఆ చెంతనే అసద్ ఉన్న పోటోలను ఆయన చూపించారు.తాము పోలీసు అనుమతి తీసుకునే పాతబస్తీ కి వెళ్లామని ఆయన చెప్పారు. కాగా షబ్బీర్, ఉత్తంకుమార్ రెడ్డిలపై దాడికి సంబందించి అఖిలపక్షం నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.
పాతబస్తీ దాడి ఘటనపై సిపి సవిూక్ష
గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఓల్డ్ సిటీలో జరిగిన దాడులపై పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి సవిూక్ష నిర్వహించారు. బుధవారం పోలీసు ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ఓల్డ్ సిటీ దాడుల నిందితులను గుర్తించి… వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యే అక్బరుద్దీన్ తనపై దాడి చేశారని బీజేపీ అభ్యర్ధి బుధవారం చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో అక్బరుద్దీన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.పురానాహవేలిలోని దక్షిణ మండల డీసీపీ కార్యాలయంలో అధికారులతో సమావేశమై నిన్నటి ఘటనలపై ఆరా తీశారు. ఈ సవిూక్ష సమావేశంలో సిటీ స్పెషల్ బ్రాంచ్ కమిషనర్ నాగిరెడ్డి, దక్షిణ మండల డీసీపీ సత్యనారాయణ, టాస్క్‌ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి, వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు, టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ కోటిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. దాడి ఘటనల్లో దర్యాప్తు ప్రత్యేక బృందాల పురోగతి, నిందితుల అరెస్ట్ అంశాలపై సీపీ సవిూక్షించారు. పాతబస్తీలో నిన్న ఎంఐఎం పార్టీ నేతలు, కార్యకర్తలు దాడికి పాల్పడిన ఘటనలపై మహేందర్‌రెడ్డి అధికారులతో చర్చించారు. ప్రధానంగా కాంగ్రెస్ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, షబ్బీర్‌అలీపై దాడులకు పాల్పడిన నిందితులను విూర్‌చౌక్ పోలీస్‌స్టేషన్ నుంచి దౌర్జన్యంగా తీసుకెళ్లిపోయిన ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు కమిషనర్ చెప్పారు. ఆ సమయంలో పోలీస్‌స్టేషన్‌లో ఉన్న సిబ్బంది వివరాలు, ఎంతమంది అనుచరులతో ఎంపీ స్టేషన్‌లోకి వచ్చారనే తదితర అంశాలపై ఆరా తీస్తున్నారు.
కాగా మజ్లిస్ గుండాలపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్ నేతలపై మజ్లిస్ దాడులకు నిరసనగా కాంగ్రెస్ నేతలు ర్యాలీ నిర్వహించి, మజ్లిస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గుండాయిజమే ప్రధాన ఆయుదంగా మలుచుకుని ఇతర పార్టీల అభ్యర్థలపై దాడులకు పాల్పడి భయబ్రాంతులకు గురిచేయడమేకాక బౌతికంగా దాడిదిగడం దారుణమన్నారు. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మండలిలో విపక్షనేత షబ్బీర్ అలీలపై దాడిచేయడం దారుణమన్నారు. పరామర్శించేందుకు వెల్లిన పీసీసీ అధ్యక్షుడు, శాసనమండలినేతలపై దాడికి దిగిన వారిపై ఇంతవరకు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని జిల్లా కాంగ్రెస్ కమిటీ తీవ్రస్థాయిలో ప్రభుత్వంపై మండిపడింది. మంగళవారం హైదరాబాద్ లో ఎన్నికల సందర్బంగా తమ పార్టీ అభ్యర్థిపైననే కాక పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మండలినేత షబ్బీర్‌ఆలీలపై దాడిచేసిన వారికి ప్రభుత్వం తొత్తుగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ బుదవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్బంగా డీసీసి మాజీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఎంఐఎం నేతలు అదికార పార్టీ అండదండలతోనే ప్రత్యక్షంగా దాడులకు దిగారని మండిపడ్డారు. దీనికి అధికార టిఆర్‌ఎస్ కూడా బాధ్యత వహించాలని అన్నారు. . ప్రజాస్వామ్య బద్దంగా జరగుతున్న ఎన్నికల్లో అధికారపార్టీతో కుమ్మక్కై ఎంఐఎం పార్టీ వారు రెచ్చిపోయి భౌతిక దాడులకు దిగడం చూస్తుంటే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఏవిదంగా ఉందో అర్థం అవుతుందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడి దాడులకు పాల్పడిన మజ్లిస్ వారిని 24 గంటల్లో పట్టుకుని చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ నాయకుల రాస్తారోకో
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలపై మజ్లిస్ దాడులకు నిరసనగా నిజామాబాద్ వ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. ధర్నాలు రాస్తారోకోలు చేపట్టింది. మజ్లిస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసింది. బాధ్యులైన మజ్లిస్ నేతలు అసదుద్దీన్, అక్బరుద్దీన్‌లను తక్షణఱం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కారును ధ్వంసం చేసినందుకు,షబ్బీర్ అలీపై దాడి చేసినందుకు నిరసనగా బుధవారం బీర్కూర్ మండల కేంద్రంలోని కామప్ప కూడలి వద్ద మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు రోడ్డుపై బైఠాయించి మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే పాషా ఖాద్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యేను వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల ఛైర్మన్ శ్రీనివాస్ యాదవ్, నియోజకవర్గ యువజన సంఘం ఉపాధ్యక్షులు హైమద్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు నారాయణ తదితరులు పాల్గొన్నారు.