గవర్నర్ విందు
– రాష్ట్రపతి హాజరు
హైదరాబాద్,జూన్30(జనంసాక్షి):
హైదరాబాద్ రాష్ట్రపతి గౌరవార్థం గవర్నర్ నరసింహన్ ఏర్పాటు చేసిన విందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరయ్యారు. రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన విందుకు ఆయనతో పాటు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మండలి చైర్మన్ స్మామిగౌడ్, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు విచ్చేశారు. ఇది ఇలా ఉండగా పదిరోజుల పర్యటనకు సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు బుధవారం ఇక్కడికి రానున్నారు. రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమలకు బుధవారం రానున్నారు. రాష్ట్రపతికి రేణిగుంట విమానాశ్రయంలో ఉదయం 10.35 గంటలకు గవర్నర్, ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతం పలుకుతారు. అనంతరం అందరూ కలిసి తిరుచానూరుకు చేరుకుంటారు. తోళప్పగార్డెన్‌లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. ఉదయం 11.30 గంటలకు తిరుపతిలోని కపిలేశ్వరస్వామివారి ఆలయానికి చేరుకుంటారు. ఇక్కడినుంచి 11.50 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.20 గంటలకు తిరుమల పద్మావతి విశ్రాంతి సముదాయానికి చేరుకుంటారు. ఒంటిగంటకు తిరుమల శ్రీవరాహస్వామివారి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుని 1.15 గంటలకు శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు. శ్రీవారిని దర్శించుకుని మధ్యాహ్నం రెండింటికి పద్మావతి విశ్రాంతి సముదాయానికి చేరుకుని భోజనానంతరం సాయంత్రం నాల్గింటి వరకు విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం తిరుమల నుంచి రేణిగుంట విమానాశ్రయానికి వెళ్లి హైదరాబాదుకు చేరుకుంటారు. తిరుపతి చేరుకున్న తరవాత రాష్ట్రపతి తొలుత తిరుచానూరు పద్మావతీ అమ్మవారిని దర్శించుకోనున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం రేణిగుంటకు చేరుకుని నేరుగా తిరుచానూరుకు పద్మావతీ అమ్మవారి ఆలయానికి వస్తారు. ఆలయంలో ఆయన దాదాపు 20 నిమిషాలు పాటు గడపనున్నారు. ఈ సందర్భంగా తితిదే ముందుస్తు ఏర్పాట్లు చేపడుతోంది. ఆలయం వద్ద తితిదే ఇస్తికఫాల్ స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే ముందు ఆయన దుస్తులు మార్చుకునే అవకాశం ఉండడంతో అందుకు అనుగుణంగా ఆలయం సవిూపంలోని తోళప్పగార్డెన్స్ వద్ద గృహాన్ని సిద్ధం చేసి ఉంచారు. తితిదే ఈవో సాంబశివరావు, జేఈవోలు శ్రీనివాసరాజు, పోలా భాస్కర్, తదితరులు ఏర్పాట్లును పరిశీలించారు. ఆలయం బయట భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. రాష్ట్రపతి పర్యటన సమయంలో రహదారి పొడవునా ఉన్న దుకాణాలను మూసివేయాలని పోలీసులు ఇప్పటికే వ్యాపారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రపతి పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులు సహకరించాలని అర్బన్ ఎస్పీ గోపినాథ్‌జెట్టి సూచించారు. రాష్ట్రపతి, ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన విమానాశ్రయంలో వివిధ శాఖల అధికారులతో సవిూక్ష సమావేశం నిర్వహించారు. విమానాశ్రయంలో బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఎటువంటి పొరపాట్లు చోటుచేసుకోకుండా పోలీసులు సమన్వయంతో విధులు నిర్వహించాలని అనంతపురం డీఐజీ కె.సత్యనారాయణ సూచించారు. పర్యటన సందర్భంగా పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు.