గాంధీలో స్వైన్‌ఫ్లూ
– ఇద్దరి మృతి
హైదరాబాద్,సెప్టెంబర్24(జనంసాక్షి): రాష్ట్రంలో మరోమారు స్వైన్ ఘంటికలు మోగాయి. హైదరాబాద్ నగరంలోని గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు వ్యక్తులు స్వైన్‌ఫ్లూ వ్యాధి కారణంగా మృతి చెందారు. మృతులు హైదరాబాద్‌లోని నేరేడ్‌మెట్‌కు చెందిన సత్యనారాయణ, ఏపీలోని అనంతపురంకు చెందిన స్వాతిబాయిలుగా గుర్తింపు. స్వైన్‌ఫ్లూ భారినపడ్డ వీరు గతకొంతకాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించి గురువారం మృతిచెందారు.దీనికితోడు డెంగీ కూడా తోడయ్యింది. విషజ్వరాలు జ్వరాలు జడిపిస్తున్నాయి. వేములవాడ, చందుర్తి, కోనరావుపేట, కథలాపూర్ మండలాలను వణికిస్తున్నాయి. మలేరియా, డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రతి ఇంటిలో ఒక్కరైనా రోగాల బారిన పడి మంచంపడుతున్నారు. వేములవాడ మండలం సంకెపల్లికి చెందిన మల్లేశం.. అదే గ్రామానికి చెందిన మరో మహిళ డెంగ్యూతో మరణించారు. బతుకు జట్కాబండిని లాగలేక సతమవుతున్న పేదలను…పులివిూద పుట్రలా విషజ్వరాలు మరింత కుంగదీస్తున్నాయి. ప్రభుత్వాస్పత్రులకు వెళ్లిన రోగులకు..సరైన వైద్యం అందక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులకెళ్లే ఆర్థిక స్తోమత లేక మృత్యువాత పడుతున్నారు. కళ్లముందు కాటికి చేరుతున్న వారిని చూసి కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. విషజ్వరాల అదుపునకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సిన వైద్యాధికారులు.. డెంగ్యూ కేసులు నామమాత్రమే అంటూ తేలికగా కొట్టిపారేస్తున్నారు. ఉన్నతాధికారులు కూడా వైద్యశిబిరాలు ఏర్పాటు చేయడంలో విూనమేషాలు లెక్కిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా కేంద్రాల్లో తప్ప ఇతర ప్రాంతాల్లో వ్యాధి నిర్ధారణ కేంద్రాలు లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రాణంపై భయంతో ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబాలు అప్పులు చేసి వైద్యం చేయించుకోవాల్సి వస్తోంది.