గాంధీ వైద్యులకు కరోనా కలకలం


` 120 మంది వైద్యులకు పాజిటివ్‌
` ఎర్రగగడ్డ ఆస్పత్రిలో రోగులు, వైద్యులకు కరోనా
హైదరాబాద్‌,జనవరి 17(జనంసాక్షి):గాంధీ ఆస్పత్రిలో కరోనా కలకలం సృష్టిస్తోంది.. కరోనా మహమ్మారి నిర్మూలనకు గాంధీ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది సేవలు మరువలేనివి.. కనిపించని మహమ్మారిపై ముందుండి పోరాటం చేస్తున్నారు.. గాంధీని కోవిడ్‌ ఆస్పత్రిగా మార్చి సేవలు అందిస్తోంది. ఇదే సమయంలో.. పెద్ద సంఖ్యలో వైద్యులు, వైద్య సిబ్బంది, ఇతర సిబ్బంది కూడా కోవిడ్‌ బారిన పడుతుండడంతో.. మిగతా వారిలో ఆందోళన మొదలైంది.. తాజాగా.. మరో 120 మంది వైద్యులకు కరోనా పాజిటివ్‌గా తేలింది.. వీరిలో 40 మంది పీజీ విద్యార్థులు, 38 మంది హౌస్‌ సర్జన్లు, 35 మంది ఎంబీబీఎస్‌ విద్యార్థులు, ఆరుగురు ఫ్యాకల్టీలు ఉన్నారు.. మరికొంత మంది వైద్యులు, వైద్య సిబ్బందికి సంబంధించిన కరోనా టెస్ట్‌ రిపోర్టులు రావాల్సి ఉంది.. కరోనా బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.. దీంతో గాంధీ ఆస్పత్రిలోని వైద్య సిబ్బంది, రోగుల్లో ఆందోళన మొదలైంది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం గత వారం కీలక నిర్ణయం తీసుకుంది. గాంధీ ఆస్పత్రిలో అత్యవసరం కాని శస్త్రచికిత్సలు నిలిపివేస్తున్నట్లు ప్రకటన చేసింది. కొవిడ్‌ కేసుల పెరుగుదల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. గత మంగళవారం నుంచే గాంధీలో అత్యవసరం కాని శస్త్రచికిత్సలు నిలిపివేశారు. అత్యవసర శస్త్ర చికిత్సలు మాత్రమే చూస్తున్నారు. ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో భారీగా కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. 9 మంది వైద్య సిబ్బందితో పాటు 57 మంది రోగులకు వైరస్‌ సోకింది. తీవ్ర లక్షణాలు ఉన్న వారిని ఐసోలేషన్‌లో ఉంచినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఉమాశంకర్‌ పేర్కొన్నారు. కొవిడ్‌ లక్షణాలు ఉన్నవారికి టెస్టులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మానసిక రోగులు కావడంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు డాక్టర్‌ ఉమాశంకర్‌ వివరించారు.

తాజావార్తలు