గాజాను స్వాధీనం చేసుకుంటాం
` ఆ ప్రాంతాన్ని ప్రత్యేకంగా కొనాల్సిన అవసరంలేదు
` ట్రంప్ పునరుద్ఘాటన
న్యూయార్క్(జనంసాక్షి):గాజాను స్వాధీనం చేసుకొని, తిరిగి నిర్మిస్తానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా జోర్దాన్ రాజు అబ్దుల్లా 2 తో భేటీ అయిన ట్రంప్..ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. దాన్ని కొనుగోలు చేయాల్సిన అవసరం లేదంటూ వ్యాఖ్యానించారు. ’మేము గాజా ను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. దాన్ని స్వాధీనం చేసుకుంటాం. గాజాను రక్షించి పునరుద్ధరిస్తాం. అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఆలోచన నాకు లేదు. మధ్యప్రాచ్యంలోని ప్రజలకు అనేక ఉద్యోగాలు సృష్టించనున్నాం’ అని ట్రంప్ ఓవెల్ కార్యాలయంలో విలేకరులతో తెలిపారు.యుద్ధం కారణంగా అనారోగ్యంతో, క్యాన్సర్‌తో బాధపడుతున్న 2 వేల మంది చిన్నారులను తమ దేశానికి తీసుకువెళతామని అబ్దుల్లా 2 ప్రకటించారు. దీనిని ట్రంప్ అద్భుతమైన విషయంగా పేర్కొన్నారు. అయితే, నిరాశ్రయులైన పాలస్తీనియన్లకు ఆశ్రయం కల్పించాలనే ప్రతిపాదనను మాత్రం జోర్దాన్ రాజు తిప్పికొట్టారు. వారిని అక్కడినుంచి పంపించకుండా గాజాను తిరిగి నిర్మించాలన్నారు. ట్రంప్ ప్రతిపాదనపై అరబ్ దేశాలు రియాద్‌లో చర్చిస్తాయన్నారు. అమెరికా గాజాను స్వాధీనం చేసుకోవాలనే ఆలోచనను గత వారం తొలిసారి ట్రంప్ బయటపెట్టారు. నాడు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తో భేటీ అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. దానిని స్వాధీనం చేసుకొని.. ఓ వెకేషన్ ప్రదేశంగా (రివేర) అభివృద్ధి చేస్తామని వ్యాఖ్యానించారు. నాడు నెతన్యాహు కూడా దీనిని ఓ విప్లవాత్మక ఆలోచనగా అభివర్ణించారు. హమాస్ మాత్రం ట్రంప్ ఆలోచనలను తీవ్రంగా తప్పుపట్టింది. ‘’కొనుగోలు చేసి.. అమ్మడానికి గాజా స్థిరాస్తి కాదు. అది మా పాలస్తీనాలో విడదీయలేని భాగం’’ అని పేర్కొంది.ఈ ప్రకటనకు ముందు గాజాలో యుద్ధం కారణంగా నిరాశ్రయులైన పాలస్తీనీయులకు అరబ్ దేశాలు ఆశ్రయం కల్పించాలని ట్రంప్ ప్రతిపాదించారు. అయితే, ఈ ప్రతిపాదనను ఆయా దేశాలు ఖండిరచాయి. తమ మిత్రదేశమైన ఈజిప్ట్, జోర్దాన్‌లు శరణార్థులకు ఆశ్రయం ఇస్తాయని శ్వేతసౌధం ప్రతినిధి కారోలైన్ లెవెట్టి తెలిపారు. మరోవైపు.. దీనికి వారు నిరాకరిస్తే అమెరికా నుంచి అందే సాయం నిలిపివేస్తామంటూ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ బెదిరింపుల నేపథ్యంలోనే అబ్దుల్లా 2 ట్రంప్‌తో భేటీ అయ్యారు.
ట్రంప్ వ్యాఖ్యలకు మేం వ్యతిరేకం
` గాజా పాలస్తీనీయులదే
బీజింగ్(జనంసాక్షి):గాజాను స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా చైనా ట్రంప్ వ్యాఖ్యలను ఖండిరచింది.’’గాజా ప్రాంతం పాలస్తీనీయులదే అక్కడినుంచి వారిని బలవంతంగా తరలించేందుకు మేం వ్యతిరేకం’’ అని స్పష్టం చేసింది. అలాగే అరబ్ లీగ్ నుంచి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమైంది. వారిని తరలించడం ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించింది. గాజాలో ఉన్న దాదాపు 20 లక్షల మంది పాలస్తీనా వాసులంతా పశ్చిమాసియాలోని వేరే ఏదైనా ప్రాంతానికి వెళ్లి శాశ్వతంగా స్థిరపడితే అమెరికా బాధ్యత తీసుకుని గాజాను పునర్నిర్మించాలని భావిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో భేటీ సందర్భంగా ట్రంప్ చెప్పారు. ‘’పాలస్తీనియన్లు వేరేచోట స్థిరపడిన తర్వాత గాజా స్ట్రిప్‌ను అమెరికా స్వాధీనం చేసుకుంటుంది. అక్కడ ఇజ్రాయెల్ అమర్చిన ప్రమాదకరమైన బాంబులను, ఆయుధాలను నిర్వీర్యం చేసే బాధ్యతను తీసుకుంటుంది’’ అని వెల్లడిరచారు. ’’దాడుల వల్ల అక్కడ నామరూపాల్లేకుండా ధ్వంసమైన భవనాలను పునర్నిర్మిస్తుంది. కాంక్రీటు శిథిలాల కింద అక్కడ ప్రజలు ఉంటున్నారు. ఆ ప్రాంతాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేస్తే అక్కడి ప్రజలకు అపరిమిత సంఖ్యలో ఉద్యోగాలు, ఇళ్లు లభించేలా చూడవచ్చు’’ అని ట్రంప్ పేర్కొన్నారు. పునర్నిర్మాణం తర్వాత పాలస్తీనావాసులతో పాటు యావత్ ప్రపంచ ప్రజలకు దానిని ఇస్తామని, అక్కడ అంతులేని అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అప్పుడు నెతన్యాహు కూడా దీనిని ఓ విప్లవాత్మక ఆలోచనగా అభివర్ణించారు. హమాస్ మాత్రం ట్రంప్ ఆలోచనలను తీవ్రంగా తప్పుపట్టింది. ‘’కొనుగోలు చేసి.. అమ్మడానికి గాజా స్థిరాస్తి కాదు. అది మా పాలస్తీనాలో విడదీయలేని భాగం’’ అని పేర్కొంది.తాజాగా జోర్దాన్ రాజు అబ్దుల్లా 2తో భేటీ అయిన ట్రంప్.. ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. ‘’’మేము గాజాను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. దాన్ని స్వాధీనం చేసుకుంటాం. గాజాను రక్షించి పునరుద్ధరిస్తాం. అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఆలోచన మాకు లేదు. మధ్యప్రాచ్యంలోని ప్రజలకు అనేక ఉద్యోగాలు సృష్టించనున్నాం’’ అని ట్రంప్ ఓవెల్ కార్యాలయంలో విలేకరులతో తెలిపారు. 2023 అక్టోబర్ నుంచి హమాస్, హెజ్‌బొల్లా వంటి గ్రూపులతో ఇజ్రాయెల్ పోరు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో బడ్జెట్ లోటు ఎదుర్కొంటోంది. దానిని తగ్గించడంతో పాటు యుద్ధ ఖర్చులను భర్తీ చేసేందుకు ఇజ్రాయెల్ చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే అంతర్జాతీయ మార్కెట్లలో 5 బిలియన్ డాలర్ల విలువైన ప్రభుత్వ బాండ్లను విక్రయించింది.