గాజాపై ఆగని బాంబుల వర్షం
` హమాస్ స్ధావరాలపై విరుచుకుపడిన ఇజ్రాయెల్
జెరూసలెం(జనంసాక్షి): గాజాలో మిలిటెంట్ గ్రూప్ హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. 400 మిలిటెంట్ టార్గెట్లపై ఫోకస్ చేస్తూ దాడులను తీవ్రతరం చేసింది. సోమవారం రాత్రి నుంచి కొనసాగుతున్న దాడుల్లో డజన్ల కొద్దీ హమాస్ ఫైటర్లను మట్టుబెట్టామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. వీరిలో ముగ్గురు డిప్యూటీ బెటాలియన్ కమాండర్లు ఉన్నారని వెల్లడిరచింది.సముద్రం నుంచి సొరంగ మార్గం ద్వారా ఇజ్రాయెల్‌లోకి చొచ్చుకువచ్చేందుకు హమాస్‌కు సహకరించే టన్నెల్‌తో పాటు మసీదుల్లో హమాస్ కమాండ్ సెంటర్లను ధ్వంసం చేశామని పేర్కొంది. మరోవైపు హమాస్‌తో యుద్ధంలో భాగంగా గాజా స్ట్రిప్‌పై దాడులను మరింత తీవ్రతరం చేస్తామని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడిరచింది.యుద్ధాన్ని తదుపరి దశకు తీసుకెళ్లేందుకు అనుకూల పరిస్థితులు సృష్టించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొన్నట్టు ఐడీఎఫ్ అధికార ప్రతినిధి డేనియల్ హగారీ తాజాగా వెల్లడిరచారు. గాజా సిటీలోని పౌరులు దక్షిణ గాజాలోకి వెళ్లిపోవాలని ఆయన మరోసారి పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు గాజాపై వైమానిక దాడులు చేస్తున్న ఇజ్రాయెల్.. హమాస్‌ను పూర్తిగా నాశనం చేసే లక్ష్యంతో తదుపరి భూతల దాడులు చేపట్టాలని చూస్తున్నట్టు తెలుస్తున్నది.
ఇజ్రాయెల్‌కు ఆ హక్కు ఉందంటూ అంగీకరించిన డ్రాగన్
ఇజ్రాయెల్‌పై హమాస్ నరమేధాన్ని ఖండిరచకపోవడంతో విమర్శలను ఎదుర్కొన్న డ్రాగన్ ఈ యుద్ధం విషయంలో తాజాగా తన వైఖరిని మార్చింది. తమ దేశాన్ని రక్షించుకునే హక్కు ఇజ్రాయెల్‌కు ఉందని అంగీకరించింది ‘ప్రతి దేశానికీ ఆత్మరక్షణ హక్కు ఉంటుంది. కానీ, అంతర్జాతీయ మానవతా చట్టాలకు కట్టుబడి పౌరులకు రక్షణ కల్పించే విధంగా చర్యలు ఉండాలి’ అని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ వ్యాఖ్యానించారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారి ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రితో ఆయన ఫోన్‌లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌కు అనుకూలంగా చైనా మాట్లాడటం ఇదే తొలిసారి. అయితే, అమెరికా ఉన్నత స్థాయి పర్యటనకు సిద్ధమవుతున్న వేళ ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం.యుద్ధం విషయంలో గత వారం చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ స్పందించిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ హమాస్ కాల్పుల విరమణకు పిలుపునిచ్చారు. అదే సమయంలో ఈజిస్ట్ సహా ఇతర అరబ్ దేశాలతో కలిసి వీలైనంత త్వరగా పాలస్తీనా సమస్యకు సమగ్రమైన, న్యాయమైన, శాశ్వత పరిష్కారం కోసం సమన్వయం చేస్తామని వ్యాఖ్యానించారు. అయితే, హమాస్ దాడిని ఖండిరచడం, ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలవడం వంటి ప్రకటన ఎక్కడా చేయలేదు. ఈ విషయంలో మొదటి నుంచి అస్పష్ట వైఖరిని అవలంభించిన చైనా.. ఇప్పుడు మాత్రం ఇజ్రాయెల్‌కు అనుకూలంగా మాట్లాడటం గమనార్హం.
హమాస్ బాగానే చూసుకుంది.. సాలెగూళ్ల వంటి సొరంగాల్లోకి తీసుకెళ్లింది..!
సోమవారం ఇద్దరు ఇజ్రాయెల్ మహిళలను హమాస్ మిలిటెంట్లు తమ చెర నుంచి విడుదల చేశారు. వారి ఆరోగ్య పరిస్థితి, మానవతా కారణాలను దృష్టిలో పెట్టుకొని విడిచిపెట్టినట్లు హమాస్ మిలిటరీ విభాగం వెల్లడిరచింది.తాజాగా వారిలో ఒక మహిళ తాను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి వెల్లడిరచారు.’ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుందని మేం ఊహించలేదు. నేను బైక్‌పై ఉన్నప్పుడు తల ఒకవైపు, మిగతా శరీరం ఇంకోవైపు ఉంది. దారిలో ఓ యువకుడు నన్ను కొట్టాడు. నా ఎముకలు విరగ్గొట్టలేదు కానీ.. నేను నొప్పితో విలవిల్లాడిపోయాను. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగింది. ఆ తర్వాత నన్ను గాజాలో ఉన్న సొరంగాల్లోకి తీసుకెళ్లారు. అవి చూడటానికి సాలెగూళ్ల మాదిరిగా ఉన్నాయి. నేను ఆ సొరంగాల్లో బందీగా ఉన్నప్పుడు వైద్యుడు ఒకరు నన్ను పరీక్షించారు. హమాస్ మమ్మల్ని బాగానే చూసుకుంది. మా అవసరాలను తీర్చింది’ అని ఆమె తెలిపారు. ఆమె పేరు యోచివెడ్ లిఫ్సిట్జ్. వయస్సు 85 సంవత్సరాలు. చక్రాల కుర్చీలో కూర్చొని విూడియాతో మాట్లాడారు. అలాగే హమాస్ ముప్పును ఇజ్రాయెల్ తీవ్రంగా తీసుకోలేదని, హమాస్‌ను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన ఖరీదైన ఫెన్సింగ్ ఉపయోగపడలేదని అన్నారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై జరిపిన ఉగ్రదాడిలో హమాస్ మిలిటెంట్లు 200 మందికిపైగా సామాన్య పౌరుల్ని బందీలుగా చేసుకున్నారు. గాజా సరిహద్దుకు దగ్గర్లోని ప్రాంతంలో ఈ ఇద్దరు మహిళలు అపహరణకు గురయ్యారు. ప్రస్తుతం వీరిద్దరి భర్తలు హమాస్ చెరలోనే ఉన్నారని ఇజ్రాయల్ ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది. ఇక వీరికి ముందు అమెరికాకు చెందిన ఇద్దరు మహిళలను కూడా మిలిటెంట్ గ్రూప్ విడిచిపెట్టిన సంగతి తెలిసిందే.