గాజాపై భీకర గగనతన దాడులు

` 24 గంటల్లో 600 స్థావరాల పేల్చివేత
` గాజాపై ఇజ్రాయెల్‌ భూతల దాడులు ఉద్ధృతం..
ఖాన్‌ యూనిస్‌ (జనంసాక్షి): హమాస్‌ మిలిటెంట్లపై ఇజ్రాయెల్‌ సైన్యం దాడులను ముమ్మరం చేసింది. గాజాలో భూతల దాడులు ఉద్ధృతం చేసిన ఇజ్రాయెల్‌ రక్షణ దళాలు వందల సంఖ్యలో హమాస్‌ స్థావరాలపై దాడులు జరిపింది. ఇందులో 20 మందికిపైగా మిలిటెంట్లను మట్టుపెట్టినట్లు ఐడీఎఫ్‌ పేర్కొంది. ఇదే సమయంలో ఉత్తర గాజా నుంచి దక్షిణం వైపు ఇజ్రాయెల్‌ యుద్ధ ట్యాంకులు కదులుతున్నట్లు సమాచారం.’గడిచిన 24 గంటల్లో 600 స్థావరాలపై దాడులు చేశాం. అంతకుముందు రోజు 450 లక్ష్యాలను మట్టుబెట్టాం. డజన్లకొద్దీ క్షిపణి ప్రయోగ స్థావరాలు, ఆయుధ డిపోలే లక్ష్యంగా దాడులు జరిపాం. ఉత్తర గాజాలో హమాస్‌తో భారీ పోరు కొనసాగుతోంది’ అని ఐడీఎఫ్‌ అధికార ప్రతినిధి వెల్లడిరచారు. మరోవైపు, ఇజ్రాయెల్‌ జరుపుతోన్న ప్రతిదాడుల్లో 8306 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయినట్లు గాజా ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. ఇందులో 3457 మంది చిన్నారులు ఉన్నారని తెలిపింది.అక్టోబర్‌ 27న భూతల దాడులను ప్రారంభించిన ఇజ్రాయెల్‌ సేనలు.. నగరం నడిబొడ్డుకు చేరుకున్నట్లు సమాచారం. అక్కడి అల్‌ అజహర్‌ యూనివర్సిటీ సవిూపంలో తలదాచుకున్నట్లు భావిస్తోన్న హమాస్‌ మిలిటెంట్లే లక్ష్యంగా దాడులు జరిపినట్లు ఐడీఎఫ్‌ పేర్కొంది. ఇందులో అనేకమంది ఉగ్రవాదులు మరణించినట్లు తెలిపింది. ఉత్తర గాజా నుంచి మరింత లోనికి యుద్ధ ట్యాంకులు ప్రవేశిస్తున్న వీడియోను ఐడీఎఫ్‌ విడుదల చేసింది. యుద్ధ ట్యాంకులతోపాటు ముందుకు కదులుతున్న సాయుధ బలగాలు.. భవనాల్లో దాక్కున్న హమాస్‌ ఉగ్రవాదులతో ఎదురు కాల్పులు జరుపుతున్న దృశ్యాలు అందులో ఉన్నాయి. ఇదే సమయంలో ఇజ్రాయెల్‌లోని ప్రధాన నగరమైన టెల్‌ అవీవ్‌పైకి పాలస్తీనా మిలిటెంట్లు క్షిపణి దాడులు కొనసాగిస్తునే ఉన్నారు.