గాజాలో కొనసాగుతున్న మారణకాండ

` హమాస్‌ అధికార ప్రతినిధి అరెస్ట్‌..!
గాజా(జనంసాక్షి):గాజాపై ఇజ్రాయెల్‌ మారణకాండ కొనసాగుతూనే ఉంది.హమాస్‌ మిలిటెంట్‌ సంస్థకు చెందిన అధికార ప్రతినిధి హసన్‌ యూసఫ్‌ను ఇజ్రాయెల్‌ దళాలు అరెస్టు చేశాయి. గురువారం వెస్ట్‌బ్యాంక్‌లో నిర్వహించిన దాడుల్లో అతడిని అదుపులోకి తీసుకొన్నాయి.హమాస్‌ కోసం పలు కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలపై అదుపులోకి తీసుకొన్నట్లు ఇజ్రాయెల్‌ అంతర్గత భద్రతా సంస్థ షిన్‌బెట్‌ ప్రకటించింది.పాలస్తీనాలో ప్రభావవంతమైన నేతల్లో యూసఫ్‌ ఒకరు. ప్రస్తుతం హమాస్‌ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నాడు. వెస్ట్‌బ్యాంక్‌ చట్టసభలో సభ్యుడు కూడా. వెస్ట్‌బ్యాంక్‌లో హమాస్‌కు చెందిన కీలకమైన 60 మంది సభ్యులను ఇజ్రాయెల్‌ బంధించింది. గతంలో యూసఫ్‌ దాదాపు 24 ఏళ్లు జైల్లోనే గడిపాడు. అంతర్జాతీయ విూడియాలో కూడా హమాస్‌ ప్రతినిధిగా అతడు తరచూ కనిపిస్తుంటాడు. ఇజ్రాయెల్‌ వాయుసేన దాడులు ఆపితే.. హమాస్‌ 200 మంది బందీలను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తుందని ఇటీవల కెనడాకు చెందిన ది గ్లోబ్‌ అండ్‌ మెయిల్‌కు ఇతడే వెల్లడిరచాడు.మరోవైపు గాజాను దిగ్బంధించడంతో అక్కడ తీవ్రమైన ఇంధన, నీటి, విద్యుత్తు కొరత ఏర్పడిరది. అక్కడ చాలా వైద్యశాలలు మూతపడుతున్నాయి. ఈ విషయాన్ని ఐరాసకు చెందిన ది కోఆర్డినేషన్‌ ఆఫ్‌ హ్యూమానిటేరియన్‌ అఫైర్స్‌ వెల్లడిరచింది. గాజాలో కార్యకలాపాలు నిర్వహించే కేర్‌ సంస్థకు చెందిన 60 కార్యాలయాలు, ఆసుపత్రులు మూతపడ్డాయని పేర్కొంది. మరోవైపు కేర్‌ సంస్థ గాజా డైరెక్టర్‌ హిబా టిబి ఓ ఆంగ్ల వార్త సంస్థతో మాట్లాడుతూ ‘’మాకు చమురు, ప్రజలకు పరిశుభ్రమైన నీరు అవసరం. ప్రస్తుతం ఇవి లభించడం గాజాలో కష్టమైపోయింది. దీంతోపాటు వైద్యశాలలకు, వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లకు ఇంధన అవసరం చాలా ఉంది. ఇక్కడ నీరు, ఇంధనం, విద్యుత్తు లభిస్తే.. పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. పలువురి ప్రాణాలు కాపాడటం సాధ్యపడుతుంది’’ అని అన్నారు.మరోవైపు గాజాకు మానవతా సాయం తరలించే అంశంపై చర్చించేందుకు ఐరాస డైరెక్టర్‌ జనరల్‌ ఆంటోనియా గుటెరస్‌ సినాయ్‌ చేరుకొన్నారు. దాదాపు రెండు వారాల నుంచి గాజాకు నీరు, ఇంధనం, విద్యత్తు, ఆహారం అందడంలేదని ఐరాస అధికార ప్రతినిధి ట్వీట్‌ చేశారు.