గాజా పాఠశాలపై ఇజ్రాయెల్‌ దాడి..

` 20 మంది మృతి.. పదుల సంఖ్యలో క్షతగాత్రులు
` తొలిసారి హిజ్బుల్లా చీఫ్‌ బహిరంగ ప్రసంగం
గాజా(జనంసాక్షి): ఇజ్రాయెల్‌`హమాస్‌ మధ్య యుద్ధం పాలస్తీనాలోని గాజాలో రక్తపుటేరులు పారిస్తున్నది. ఇజ్రాయెల్‌ దాడులతో గాజా స్ట్రిప్‌లో అమాయక పౌరులు మరణిస్తున్నారు. గత నెల సెంట్రల్‌ గాజాలోని ఓ దవాఖానపై ఇజ్రాయెల్‌ జరిపిన దాడిలో 500 మందికిపైగా మృతిచెందగా, మూడు రోజుల క్రితం జబాలియా శరణార్థి శిబిరంఉన్న అపార్ట్‌మెంటుపై జరిగిన వైమానిక దాడిలో 50 మందికిపైగా మృత్యువాతపడ్డారు. తాజాగా గాజాలోని ఓ స్కూల్‌పై మోర్టార్‌ షెల్స్‌తో ఇజ్రాయెల్‌ దాడి చేసిందని, దీంతో 20 మంది చనిపోయారని, డజన్ల కొద్ది గాయపడ్డారని హమాస్‌ నేతృత్వంలోని పాలస్తీనా ప్రభుత్వం ప్రకటించింది.ఉత్తర గాజాలోని అల్‌ సఫ్టవే ప్రాంతంలో ఉన్న ఓ స్కూల్‌లో శరణార్థులు ఆశ్రయం పొందుతున్నారని, ఆ పాఠశాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్‌ బాంబుల వర్షం కురిపించిందని హమాస్‌ ఆరోపించింది. దీంతో 20 మంది మరణించారని వెల్లడిరచింది. గాయపడిన వారిని అల్‌`షిఫా హాస్పిటల్‌కు తరలించామని చెప్పింది. కాగా, శుక్రవారం ఓ అంబులెన్స్‌పై ఇజ్రాయెల్‌ సైన్యం వైమానిక దాడి చేసింది. దీంతో 15 మంది అక్కడికక్కడే మరణించారు. మరో 60 మంది గాయపడ్డారు.గత నెల 7న ప్రారంభమైన ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడితో ఇరు పక్షాల మధ్య యుద్ధం ప్రారంభమైంది. దీంతో ఇప్పటివరకు సుమారు 9,227 మంది పాలస్తీనియన్లు మరణించారు. వారిలో 3,826 మంది చిన్నారులు ఉన్నారు. ఇక హమాస్‌ దాడిలో 1400 మంది ఇజ్రాయెల్‌ పౌరులు చనిపోయారు. కాగా, ఇరు పక్షాలు కాల్పుల విరమణ ప్రకటించాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లికెన్‌ చేసిన ప్రతిపాదనను ఇజ్రాయెల్‌ తోసిపుచ్చింది.శుక్రవారం ఇజ్రాయెల్‌లో పర్యటించిన ఆంటోని బ్లింకెన్‌ ఆ దేశ ప్రధాని బెంబమెన్‌ నెతన్యాహూతో టెల్‌ అవీవ్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మానవతా సహాయం నిమిత్తం కాల్పుల విరమణ ప్రకటించాలని ఆయనను కోరారు. అయితే దీనికి నెతన్యాహూ నిరాకరించారు. హమాస్‌ చెరలో బందీలుగా ఉన్న ఇజ్రాయెలీలను విడిపించేవరకు యుద్ధం కొనసాగుతుందని ప్రకటించారు.
హిజ్బుల్లా చీఫ్‌ తొలిసారి బహిరంగ ప్రసంగం
ఇజ్రాయెల్‌పై ‘పవిత్ర యుద్ధం’లో త్యాగాలకు సిద్ధమయ్యామని లెబనాన్‌లో మిలిటెంట్‌ గ్రూప్‌కు నేతృత్వం వహిస్తున్న హిజ్బుల్లా చీఫ్‌  సయ్యద్‌ హసన్‌ నస్రల్లా ప్రజలకు పిలుపునిచ్చారు.  హమాస్‌, ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం మొదలై సుమారు నెల రోజులవుతున్న తరుణంలో శుక్రవారం ఆయన తొలిసారి బహిరంగంగా టీవీలో ప్రసంగించారు. అక్టోబర్‌ 7న ఇజ్రా యెల్‌పై హమాస్‌ అనూహ్య దాడిని ఆయన సమర్థించారు. హమాస్‌ ఆపరేషన్‌ అల్‌ అక్సా ప్లడ్‌ నిర్ణయం వంద శాతం పాలస్తీన్లదే అని తెలిపారు. పాలస్తీనా భూభాగం, పాలస్తీనా ప్రజల కోసమే హమాస్‌ యుద్ధమని అన్నారు. ప్రాంతీయ సమస్యతో దీనికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. కాగా, అక్టోబర్‌ 7 నాటి హమాస్‌ దాడి ఇజ్రాయెల్‌లో భూకంపం సృష్టించిందని హిజ్బుల్లా చీఫ్‌ సయ్యద్‌ హసన్‌ నస్రల్లా అభివర్ణించారు. ‘హమాస్‌ నిర్ణయం సరైనది, తెలివైనది, ధైర్యంతో కూడు కున్నది, సరైన సమయంలో జరిగింది’ అని వ్యాఖ్యానించారు. హమాస్‌పై దాడి మొదలై నెలవు తున్నా ఇజ్రాయెల్‌ ఒక్క మిలిటరీ విజయాన్ని సాధించలేకపోయిందని విమర్శించారు. ఇజ్రాయెల్‌ చర్చల ద్వారా మాత్రమే బంధీలను తిరిగి పొందగలదని అన్నారు. పాలస్తీనాపై ఇజ్రాయెల్‌ దాడు లు, పౌరుల మరణాలకు అమెరికా కారణమని ఆరోపించారు.  నస్రల్లా టెలివిజన్‌ ప్రసంగాన్ని వినేందుకు లెబనాన్‌ ప్రజలు ఆసక్తి చూపారు.  రాజధాని బీరూట్‌లోని ఒక చౌరస్తా వేలాది మందితో నిండిపోయింది. హిజ్బుల్లా చీఫ్‌ తొలి ప్రసంగం సందర్భంగా తుపాకీ కాల్పులు కూడా మారుమో గాయి. ఆయన ప్రసంగంతో హమాస్‌, ఇజ్రాయెల్‌ వార్‌ ప్రాంతీయంగా విస్తరించవచ్చని యుద్ధ నిఫుణులు అనుమానిస్తున్నారు.