గాడి తప్పుతున్న నేతల ప్రచారం

` ప్రధాన పార్టీల తీరుపై ఈసీ ఆగ్రహం
` కాంగ్రెస్‌, బీజేపీ అధ్యక్షులకు నోటీసులు
న్యూఢల్లీి(జనంసాక్షి):సార్వత్రిక ఎన్నికల ప్రచారాల్లో నిమగ్నమైన ప్రధాన రాజకీయ పార్టీలు.. విమర్శనాస్త్రాలతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో అగ్ర నేతలు, ముఖ్య ప్రచారకర్తలు చేసే ప్రసంగాలు గాడి తప్పుతున్నాయంటూ ఎన్నికల సంఘం కన్నెర్ర చేసింది. ప్రచారాల్లో కుల, మత ప్రస్తావనలను తీసుకురావడంపైనా విరుచుకుపడిరది. నేతల ప్రచారశైలిలో మార్పు రావడం లేదని, ఇకనైనా సరిదిద్దుకోవాలని పేర్కొంటూ భాజపా, కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షులకు నోటీసులు జారీ చేసింది.ఎన్నికల ప్రచారాల్లో మతపరమైన అంశాలకు దూరంగా ఉండాలని భాజపా, కాంగ్రెస్‌ పార్టీలకు ఎన్నికల సంఘం సూచించింది. ముఖ్యంగా సమాజంలో విభజనకు దారితీసే ప్రసంగాలను వెంటనే ఆపాలని భాజపాకు స్పష్టం చేసింది. రాజ్యాంగం రద్దవుతుందనే తప్పుడు అభిప్రాయం కలిగించే ప్రకటనలకు దూరంగా ఉండాలని కాంగ్రెస్‌ను ఆదేశించింది. అగ్నివీర్‌ వంటి పథకాలపై ప్రసంగాలు చేసేటప్పుడు.. సాయుధ బలగాలను రాజకీయం చేయవద్దని పేర్కొంది. భాజపా, కాంగ్రెస్‌లు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం, వాటిని సమర్థించుకోవడాన్ని ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. అధికారంలో ఉన్న పార్టీ మరింత బాధ్యతగా వ్యవహరించాలన్న ఈసీ.. ప్రతిపక్ష పార్టీకీ ఈ విషయంలో మినహాయింపు లేదని పేర్కొంది. ఎన్నికల వ్యవస్థపై భారత ఓటరుకు ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసే చర్యలను ఈసీ ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించదని స్పష్టంచేసింది. ఈ క్రమంలోనే ప్రచారాల్లో సంయమనం పాటించి, ప్రసంగాలను సరిచేసుకునేలా స్టార్‌ క్యాంపెయినర్లకు సూచించుకోవాలని రెండు జాతీయ పార్టీలకు ఈసీ సూచించింది.