గాలివాన బీభత్సం

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలకు 11 మంది మృతి
గోడ, రేకులు, చెట్టు కూలిన ఘటనలతో విషాదాలు
నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఏడుగురు, మేడ్చల్‌లో ఇద్దరు.. సిద్దిపేటలో ఇద్దరు..
పలుచోట్ల ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం
హైదరాబాద్‌/నాగర్‌కర్నూల్‌ బ్యూరో/ మేడ్చల్‌ ప్రతినిధి, కీసర (జనంసాక్షి)
రాష్ట్రవ్యాప్తంగా ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. వేర్వేరు ఘటనల్లో పదకొండు మంది మృతిచెందారు. మరికొందరు గాయపడ్డారు. గోడ కూలి ఓచోట.. షెడ్డు కూలి ఇంకోచోట.. చెట్టు కూలి మరోచోట.. పిడుగుపాటుతో బాలుడు.. ఇలా వేర్వేరు ఘటనల్లో ప్రాణాలు విడిచారు. ఈదురుగాలులకు పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. దాంతో పలుచోట్ల విద్యుత్‌ సరఫరాలో అంతరాయం నెలకొన్నది. ప్రధాన రహదారుల వెంట ట్రాఫిక్‌ కూడా స్తంభించింది.
నాగర్‌ కర్నూలు జిల్లాలో ఆదివారం వర్షం కురిసింది. తాడూరు మండలం ఇంద్రకల్‌ గ్రామ శివారులో షెడ్‌ నిర్మాణంలో ఉండగా.. సాయంత్రం వర్షానికి గోడ కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో కోళ్ల ఫామ్‌ యజమానితో పాటు అతని కుమార్తె, ఇద్దరు కూలిలో చనిపోయారు. మృతులను కోళ్లఫామ్‌ యజమాని మల్లేశ్‌ (40), అతని కూతురు అనూష (10), కూలీలు చెన్నమ్మ, రాము మృతి చెందారు. కూలీలు చెన్నమ్మ, రాము స్వస్థలం పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లి. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు చోటు చేసుకున్నాయి. మృతదేహాలను జిల్లా ఆసుపత్రికి తరలించారు. అలాగే, తెలకపల్లిలో పిడుగుపాటుకు ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. బిజినేపల్లి మండలం నందివడ్డెమాన్‌ గ్రామంలోనూ ఓ వ్యక్తి మృతి చెందాడు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా కేంద్రంలో మంతటి చౌరస్తాలో కారులో కూర్చున్న వేణుగోపాల్‌పై పక్కనే ఉన్న రేకుల షెడ్డు కూలి ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. నాగర్‌కర్నూల్‌, పాలెం, బిజినేపల్లి, తిమ్మాజిపేట, చెన్నపురావుపల్లి, కల్వకుర్తి, పదర, పెద్దూరు, తూడుకుర్తిలాంటి పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.
మేడ్చల్‌ జిల్లా కీసరలో ఈదురుగాలులకు చెట్లకొమ్మలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. తిమ్మాయిపల్లి నుంచి షామీర్‌పేట వెళ్లేదారిలో చెట్టు విరిగిపడిరది. దాంతో రాంరెడ్డి, ధనుంజయరెడ్డి అనే ఇద్దరు మృతి చెందారు. రాంరెడ్డి (48) సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడువగా.. చికిత్స పొందుతూ ధనుంజయరెడ్డి (45) కన్నుమూశాడు. మృతుల స్వస్థలం యాదాద్రి జిల్లా బొమ్మల రామారంగా గుర్తించారు. సిద్దిపేట జిల్లాల్లోనూ వర్షాలకు గోడకూలి మరో ఇద్దరు ప్రాణాలు వదిలారు. ములుగు మండలం క్షీరసాగర్‌లో కోళ్లఫారం కోడకూలింది. ఇదే ఘటనలో మరో ముగ్గురికి గాయాలయ్యాయి.

హైదరాబాద్‌వ్యాప్తంగా..
హైదరాబాద్‌లో పలుచోట్ల ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుసింది. కీసర, ఘట్‌కేసర్‌ ప్రాంతాల పరిధిలో ఈదురుగాలులు వీస్తూ ఉరుములతో కూడిన వర్షం కురిసింది. పలుచోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. అబ్దుల్లాపూర్‌మెట్‌లోనూ ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. హయత్‌నగర్‌, పెద్ద అంబర్‌పేట ప్రాంతాల్లో ఉధృతంగా ఈదురుగాలులు వీశాయి. హయత్‌నగర్‌ ప్రాంతంలో గాలికి రేకులు, గుడిసెల పైకప్పులు కొట్టుకుపోయాయి. మల్కాజ్‌గిరి, తుర్కయాంజ్‌లో ఈదురుగాలులు వీయగా.. వర్షం కురిసింది. పలుచోట్ల పిడుగులుపడ్డాయి. అలాగే, అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట పరిధిలోనూ ఈదురుగాలులతో వర్షం వాన కురిసింది. నాగోల్‌, మన్సూరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. ఎల్‌బీనగర్‌, వనస్థలీపురంలో గాలులతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. మరోవైపు మేడ్చల్‌ జిల్లా కీసర మండలంలోనూ గాలులు ఉద్ధృతంగా వీచాయి.