గిట్టుబాటు ధరలతో ఆదుకోవాలి
ఆదిలాబాద్,డిసెంబర్29(జనంసాక్షి): పంటనష్టపోయిన పత్తిరైతులను ఆదుకోవడంతో పాటు ఆయా పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని సిపిఐ డిమాండ్ చేసింది. రైతుల వద్ద ఉన్న సోయాబీన్‌ను కొనుగోలు చేయాలని ఆపార్టీ కార్యదర్శి ఎం.ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. సోయాబీన్ పూర్తిగా కొనుగోలు చేయకుండానే యార్డుల్లో కేంద్రాలను ఎత్తివేయడం విడ్డూరంగా ఉందన్నారు. పత్తికి గిట్టుబాటు ధర లభించక ముందుగానే విక్రయించుకోగా.. ఇపుడు పత్తి ధర అమాంతంగా పెరుగుతోందన్నారు. అదే మాదిరి రైతుల వద్ద సోయాబీన్ ఉండగా.. వాటిని కొనుగోలు చేసే ప్రభుత్వ యంత్రాంగం లేక ప్రైవేటుగా తక్కువ ధరకే విక్రయించుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని విమర్శించారు. అండగా నిలవాల్సిన ప్రభుత్వరంగ సంస్థలు రైతుల గోడును పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా సోయా రైతులను ఆదుకునే దిశగా కొనుగోలు కేంద్రాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.