గిట్టుబాటు ధరలు కల్పించాలి

ఎన్నికల్లో కలసికట్టుగా సాగుతాం: నరేశ్‌ జాదవ్‌

ఆదిలాబాద్‌,నవంబర్‌3(జ‌నంసాక్షి): రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించకపోవడం శోచనీయమని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు నరేష్‌ జాదవ్‌ అన్నారు. వ్యాపారులు క్వింటాలుకు తేమ రూపంలో 4 నుంచి 5 కిలోల కోత విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రైతుకు గిట్టుబాటు ధరలు లేక పెట్టిన పెట్టుబడులు సైతం రాని పరిస్థితి నెలకొందని, ఈ పరిస్థితిలో వ్యాపారులు రైతును దోపిడీ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి జిన్నింగుల్లో మార్కెట్‌ నిబంధనల ప్రకారం కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్‌ను గెలిపించేందుకు . కార్యకర్తలందరు కలిసికట్టుగా పని చేయాలని కోరారు. టిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ప్రజలంతా సంఘటితం కావాలన్నారు. మరోవైపు ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ప్రతి నియోజకవర్గంలో ముఖ్య నాయకులు వర్గాల వారీగా విడిపోయినా… ఎన్నికలకు మాత్రం సిద్ధంగా ఉన్నారు. ఇటీవల రాష్ట్రంలో రాహుల్‌గాంధీ రెండు రోజుల పర్యటన విజయవంతం కావడంతో పార్టీ యంత్రాంగంలో కదనోత్సాహం నిండిందని ఆ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. ఎన్నికల్లో తమ వర్గానికి ఎక్కువ సీట్లు దక్కేలా పావులు కదిపే ఆలోచనతో ఇద్దరు ఉన్నారు. కాగా మహేశ్వర్‌రెడ్డి వర్గంతో పాటు జిల్లాలో ప్రేంసాగర్‌రావు గ్రూపు కూడా టిక్కెట్ల వేటలో తమవంతు ప్రయత్నాల్లో ఉన్నారు. మండలాల వారీగా బలాన్ని మరింత పెంచుకొని టిక్కెట్ల పోటీలో ముందు వరుసలో ఉండాలని యోచిస్తున్నారు. వివిధ నియోజకవర్గాల్లో టిక్కెట్లు ఆశిస్తున్న ఈ వర్గం నాయకులు స్థానికంగా పట్టును పెంచుకునే పనిలో పడ్డారు. ఢిల్లీలో టిక్కెట్ల పంపిణీ నాటికి అనేక పరిణామాలు చోటు చేసుకుంటాయని వీరు భావిస్తున్నారు.