గిట్టుబాటు ధరల కోసమే కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
జనగామ,ఏప్రిల్20(జనంసాక్షి): రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకే తెలంగాణ ప్రభుత్వం ఊరూర ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని రైతు సమన్వయ సమితి జిల్లా కో-ఆర్డినేటర్ ఇర్రి రమణారెడ్డి అన్నారు. పలు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు దళారుల మాటలు నమ్మి, మోసపోవద్దని, నేరుగా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని సూచించారు. ఈ సందర్బంగా ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు మద్దతు ధర అందుతోందని అన్నారు. గత ప్రభుత్వాల పాలనలో రైతులను పట్టించుకోలేదన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఏ గ్రేడ్ వరి ధాన్యం క్వింటాలుకు రూ.1590, సీ-గ్రేడ్ రకానికి రూ.1550 అందజేస్తున్నట్లు చెప్పారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు. రైతుల శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతీ గ్రామానికి గోదావరి జలాలను అందించడంతో వరి సాగు పెరిగిందని చెప్పారు. ఖరీఫ్ సీజన్ నుంచి ప్రతి ఎకరానికి రూ.8వేలు రైతులకు అందజేస్తూ పెట్టబడి కింద సాయం అందిస్తున్న ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదే దక్కిందన్నారు.