గిరిజన గూడాల్లో ఇప్ప మొక్కల పంపిణీ
ఆదిలాబాద్,జూలై28(జనం సాక్షి): జిల్లా వ్యాప్తంగా అటవీశాఖ ఆధ్వర్యంలో కోటి మొక్కలు నాటేందుకు ప్రణాళిక తయారు చేశారు. కెస్లాపూర్ నాగోబా ఆలయం నుంచే హరితహారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఆదివాసీ గ్రామంతోపాటు గూడెంలో, ప్లలెలో వేయి చొప్పున ఇప్పపువ్వు మొక్కలు పంపిణీ చేస్తున్నారు. ఆదివాసీ గిరిజన రైతులు తమతమ వ్యవసాయ భూముల్లో తప్పకుండా ఇప్ప మొక్కలు నాటాలన్నారు. ఇంటి పరిసరాల్లో పండ్ల మొక్కలు నాటుకొని వాటికి పూర్తి రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ఆదివాసీ గిరిజనులు తమ సంస్కృతి, సంప్రదాయంతోపాటు ఆచారంలో భాగమైన ఇప్పపువ్వు చెట్లను కాపాడుకొని భావితరాలకు సంప్రదాయాలు తెలిసేలా చూడాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగో విడత హరితహారం కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని మరోవైపు కలెక్టర్ దివ్య దేవరాజన్ అన్నారు. అందుబాటులో ఉన్న ఇప్పమొక్కలను ఆదివాసీ గిరిజన రైతులతోపాటు గిరిజన మహిళలకు పంపిణీ చేశారు. ఎన్ని రకాల మొక్కలు, ఎన్ని మొక్కలు నాటుతారనేది అధికారులను అడిగితెలుసుకున్నారు. ఆదివాసీ గిరిజన గ్రామాలకు వేయి చొప్పున ఇప్ప మొక్కలు పంపిణీ చేస్తామని, ప్రతి గిరిజన రైతు తమ వ్యవసాయ భూ మిలో ఆ మొక్కలు నాటాలని అన్నారు. నాటిన ప్రతి మొక్కకు పూర్తి రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.జిల్లా వ్యాప్తంగా ఎన్ని అడవుల్లో గచ్చకాయ మొక్కలు నాటారు అనేది అటవీశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.