గిరిజన గ్రామాల సమస్యలు పట్టని రాజకీయ పార్టీలు
నాలుగేళ్లుగా పట్టించుకోని తెలంగాణ పాలకులు
ఆదిలాబాద్,నవంబర్14(జనంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనేకానేక సమస్యలు ఉన్నా ఎవరు కూడా వీటిని ప్రస్తావించడం లేదు. అధికార టిఆర్‌ఎస్ అంతా చేశామనే గొప్పలు చెప్పడం మినహా, జిల్లాల్లో కనీసంగా రహదారి సౌకర్యాలను కూడా మెరుగు పర్చలేదు. గిరిజనుల గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు కరవయ్యాయి. ప్రధానంగా అంటువ్యాధులు ప్రబలే ప్రమాదంతో పలుచోట్ల గ్రావిూణులు నాటు వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. జిల్లాలోని పలు మండలాల పరిధిలో అనేక గ్రామాలకు నేటికీ రహదారుల లేక ప్రజలు ఇతర గ్రామాలకు రాకపోకలు సాగించడానికి నానా అవస్థలు పడుతున్నారు. దట్టమైన అడవుల్లో, మొనదేలిన రాళ్ల మధ్య నడుస్తూ బతుకుపోరాటం చేస్తున్నారు. తిర్యాణి, వాంకిడి, బెజ్జూర్, కాగజ్‌నగర్ మండలాల్లో దారులు లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారులే
లేని గ్రామాలు ఉంటే ఇక చినుకు పడితే కాలు తీసి ముందుకు వేయలేని విధంగా బురద దారులు, వంతెనలు లేని అనేక గ్రామాల ప్రజలు వర్షాకాలం బాహ్య ప్రపంచానికి దూరం అవుతున్నారు. విద్యుత్ వెలుగులు, తాగు నీరు, రహదారులు వంటి సదుపాయాలు కొరవడిన గ్రామాల్లో ప్రజలు అవస్థలుపడటం పరిపాటిగా మారింది. ఓటర్లుగానే తప్పితే మనుషులుగా తమను నాయకులు గుర్తించడం లేదంటూ గిరిజనులు వాపోతున్నారు. కొండకొనలతో సహజీవనం చేస్తూ, మౌలిక సదుపాయాలు కొరవడి అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న ప్లలెలపై నేతలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. జిల్లావ్యాప్తంగా అనేక గ్రామాల ప్రజలు నేటికీ రహదారి సౌకర్యానికి నోచుకోవడం లేదు. రాళ్లతో నిండిన బాటలతో నడక సాగిస్తూ నానా పాట్లు పడుతున్నారు. అనేక గ్రామాలకు కాలిబాటలు కూడా లేవు. దీంతో ఇతర గ్రామాలకు వెళ్లడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సమయంలో ఇతర గ్రామాలకు వెళ్లాలన్నా, పంటలను విక్రయిద్దామన్నా కొండలను ఎక్కి దిగాల్సి వస్తుంది. రహదారి, తాగునీరు సౌకర్యం లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొత్తగా ఏర్పడ్డ కుమ్రం భీమ్ జిల్లాలో సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించాలని స్థానిక గిరిజన సంఘాలు కోరుతున్నాయి. అనేక గిరిజన గ్రామాల్లో నేటికీ విద్యుత్ సౌక్యం లేకుండా పోయింది. ఇలాంటి గ్రామాల్లో అభివృద్ధి మాటెలా ఉన్నా అక్కడికి చేరుకోవడానికి దారులు కూడా లేవు. గిరి ప్లలెలకు రహదారి, విద్యుత్తు సౌకర్యం కల్పించడానికి కృషి చేయాలని ఆదివాసీలు కోరుతున్నారు. ఆయా గూడాల్లోని గ్రామాల్లో ఒక్కగానొక్క బోరు మాత్రమే ప్రజల నీటి అవసరాలను తీరుస్తోంది. అనేక గ్రామాల్లో ఇప్పటికీ చెలిమెలు, వాగు నీటితోనే గొంతు తడుపుకొంటున్నారు. వాంకిడి మండలంలోని గ్రామాలు ఏర్పడి దశాబ్దాలు గడుస్తున్నా నేటికీ విద్యుత్తు వెలుగులకు నోచుకో లేదు. అనేక గ్రామాల ప్రజలు చీకట్లలోనే కాలం వెళ్లదీస్తున్నారు. వీటి గురించి ఎవరు కూడా ప్రస్తావించడం లేదు. ఎన్నికల్లో ఈ సమస్యలను ప్రస్తావించి పరిష్కరిస్తామన్న వారు ముందుకు రావాల్సి ఉంది.