గిరిజన ప్రాంతాల్లోనూ కంటివెలుగు
వైద్యబృందాలను వినయోగించుకోవాలి: ఎంపి
ఆదిలాబాద్,ఆగస్ట్16(జనం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు నిర్వహించు కోవాలని ఎంపి గోడం నగేశ్ అన్నారు. కంటి వెలుగు పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అంధత్వ నివారణకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటుందని అన్నారు. ప్రతిపక్ష నాయకులకు అభివృద్ధి కనిపించడం లేదని వారు కూడా కంటి పరీక్షలు నిర్వహించు కోవాలని ఎద్దేవా చేశారు. పథకం ద్వారా ప్రతి గ్రామంలో వారికి అవసరమైన కంటి అద్దాలు ఉచితంగా ఇస్తామన్నారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇందుకోసం ఉమ్మడి జిల్లాలో భారీగా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. అలాగే గిరిజన ప్రాంతాల్లో కూడా ప్రజలకు అందుబాటు వైద్య బృందాలు ఉన్నాయని అన్నారు. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ప్రతి రోజూ పట్టణంలో 300 మందికి, గ్రావిూణ ప్రాంతాల్లో 250 మందికి కంటి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. చూపు మందగించిన వారికి కళ్ల జోళ్లు, అవసరం ఉన్న వారికి మందులతో పాటు రిమ్స్, ఎల్‌వీ ప్రసాద్ దవాఖానల్లో శస్త్ర చిక్సితలు చేస్తారన్నారు. మెరుగైన శస్త్ర చికిత్సల కోసం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని పలు వైద్యశాలల్లో రవాణా భత్యం లేకుండానే అక్కడ శస్త్ర చిక్సితలు చేయిస్తామన్నారు. కంటి వెలుగు కార్యక్రమం కోసం జిల్లాలో 18 వైద్య బృందాలను ఏర్పాటు చేశామన్నారు.ఈ కార్యక్రమం 2019 జనవరి వరకు నిరంతరంగా కొనసాగుతుందని తెలిపారు. వారంలో ఐదు రోజుల పాటు కంటి వైద్య పరీక్షలు నిర్వస్తారని చెప్పారు. జిల్లాలో నూటికి నూరు శాతం మంది కంటి పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఆశ, ఏఎన్‌ఎంలు ప్రతి ఇంటికీ తిరుగుతూ కంటి వైద్య పరీక్షలు చేయించు కోవాలని ప్రతి ఒక్కరినీ ఆహ్వానించాలన్నారు. ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు నిర్వహించుకొనేలా చూడాల్సిన బాధ్యత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న వైద్య సిబ్బందిపై ఉందన్నారు.