గిరిజన సమస్యలు పరిష్కరించాలి
ఆదిలాబాద్,జూలై30(జనం సాక్షి): గిరిజన తండాలు, గిరిజన గూడాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసిన సందర్బంగా అవసరమైన నిధులు కూడా ఇచ్చి ప్రభుత్వం హావిూని వెంటనే అమలు చేయాలని గిరిజన సంఘాల ఐకాస నాయకులు డిమాండ్ చేశారు. ఆదివాసీ గిరిజనుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తే వారు పరిష్కరిస్తారనే సదాశయంతో అనాడు ఆచార్య హెమన్‌డార్ఫ్ నాగోబా జాతరలోదర్బార్‌ను ఏర్పాటు చేశారని అన్నారు. అయితే ఆ స్ఫూర్తి కొరవడిందన్నారు. ఇప్పటికే గిరిజన ఉపప్రణాళిక కింద మంజూరవుతున్న వేలకోట్ల రూపాయాలను దారి మళ్లిస్తున్నారని దుయ్యబట్టారు. పోరాడి సాధించుకున్న అటవీ హక్కుల భూములలో అటవీశాఖ అధికారులు యథేచ్ఛగా కందకాలను తవ్వుతూ గిరిజనుల భూహక్కును కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. గిరిజన సమస్యలను తక్షణం పరిష్కరించాలన్న లక్ష్యం నీరుగారుతోందన్నారు. గిరిజనుల సమస్యలను అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లేందుకు గిరిజన సంఘాల నాయకులను విశ్వాసంలోకి తీసుకుని వెళ్ళాలని డిమాండ్ చేశారు.