గుంటూరులో ఘోరం

2
– ఎలుకల దాడిలో పసికందు మృతి

– చికిత్సకు వస్తే చితిపేర్చారు

– ప్రభుత్వ వైద్యశాల నిర్వాకం

గుంటూరు, ఆగస్ట్‌ 26 (జనంసాక్షి):

గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. వైద్యశాఖ నిర్లక్ష్యం ఓ పసివాడిని బలితీసుకుంది. ఎలుకల దాడి చేయడంతో వారంరోజుల పసికందు ప్రాణాలు కోల్పోయాడు. చిన్నారి శరీరాన్ని ఎలుకలు పీక్కుని తినడంతో వైద్యులు అత్యవసర విభాగంలో చేర్చి చికిత్స అందించారు. అయినప్పటికీ పసికందు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఆదివారం జరిగినప్పటికీ ఆస్పత్రి అధికారులు గోప్యంగా ఉంచినట్లు తెలిసింది. చివరికి బిడ్డ ప్రాణాలు కోల్పోవడంతో విూడియాకు సమాచారం అంది విషయం వెలుగులోకి వచ్చింది.

విజయవాడ కృష్ణలంకకు చెందిన నాగ, లక్ష్మి దంపతులకు ఈ నెల 17న బాలుడు జన్మించాడు. పుట్టగానే అనారోగ్య సమస్యలు రావడంతో అక్కడి వైద్యుల సలహా మేరకు గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఈనెల 19న చిన్నారికి శస్త్ర చికిత్స నిర్వహించారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న బాలుడిని వార్డులో ఎలుక కరిచిందని తల్లిదండ్రులు బుధవారం సూపరింటెండెంట్‌ వేణుగోపాలరావుకు ఫిర్యాదు చేశారు. మధ్యాహ్నం 2గంటల సమయంలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. ఎలుక కరవడంవల్లే తమ బిడ్డ చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపిస్తుండగా వైద్యులు మాత్రం అనారోగ్యం కారణంగానే మృతి చెందినట్లు చెప్తున్నారు. దీనిపై విచారణ చేసి నివేదిక ఇచ్చేందుకు జనరల్‌ సర్జరీ విభాగం అధిపతి సుబ్బారావు నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు సూపరింటెండెంట్‌ తెలిపారు. కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వారు హావిూ ఇచ్చారు. వివిధ ప్రజా సంఘాల నాయకులు ఎలుక కరిచినందునే బాలుడు మృతి చెందాడని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు.ఇదిలావుంటే ఆస్పత్రిలో అపరిశుభ్రత కారణంగా ఎలుకలు సంఖ్య పెరిగి చివరకు ప్రాణాలు తీస్తున్నాయని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డ వారం రోజులకే ప్రాణాలు కోల్పోవడంతో పసికందు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై ఆంధప్రదేశ్‌ ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ ఆరా తీశారు. వైద్యుల ద్వారా వివరాలు తెలుసుకున్నారు. దీనిపై విచారణ చేపట్టి పూర్తి వివరాలతో తనకు నివేదిక అందించాలని ఆస్పత్రి వైద్యులను మంత్రి ఆదేశించారు.