గుజరాత్‌లోనూ ట్యాంపరింగ్‌ అనుమానాలు: కాంగ్రెస్‌

బెంగళూరు,డిసెంబర్‌4(జ‌నంసాక్షి): ఉత్తరప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటింగ్‌ యంత్రాల దుర్వినియోగం జరిగినట్లు అమెరికా నిపుణులు అనుమానాలు వ్యక్తం చేశారని కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ పరమేశ్వర్‌ అన్నారు. తాము కూడా వాటితో ఏకీభవిస్తున్నట్లు చెప్పారు.గుజరాత్‌ ఎన్నికల్లో ఓటింగ్‌ యంత్రాల దుర్వినియోగం జరిగినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా రాహుల్‌గాంధీ పగ్గాలు చేపడితే పార్టీ బలోపేతమవుతుందని అన్నారు. మంచి నాయకత్వ లక్షణాలు కలిగిన యువనేతగా, నిజాయతీపరుడిగా రాహుల్‌ గుర్తింపుపొందారని వారు పేర్కొన్నారు. యువతకు ఆశాజ్యోతిగా కనిపిస్తున్నారని, ఆయన నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

పార్టీ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ 18 ఏళ్లు బాధ్యతలు నిర్వహించారని, ఇప్పుడు అధ్యక్ష పగ్గాలు చేపట్టేందుకు రాహుల్‌గాంధీ సిద్ధమయ్యారని, పార్టీ మొత్తం ఆయన నాయకత్వానికి కట్టుబడి ఉందన్నారు. 130 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీకి నూతన అధ్యక్ష స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు.

రాహుల్‌ గాంధీని సమర్థిస్తూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ పరమేశ్వర్‌, లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత మల్లికార్జున ఖర్గే, కేంద్ర మాజీ మంత్రులు సీకే జాఫర్‌ షరీఫ్‌, వీరప్పమొయిలీ, కె.హెచ్‌.మునియప్ప, ఎం.వి.రాజశేఖరన్‌, రాష్ట్ర మంత్రులు డీకే శివకుమార్‌, కేజేజార్జి, హెచ్‌.కె.పాటిల్‌, ఎం.ఆర్‌.సీతారాం, ఈశ్వర ఖండ్రే, మాజీ మంత్రి మోటమ్మ, బీఎల్‌శంకర్‌ తదితరులు నామపత్రంపై సంతకాలు చేశారు.