గుజరాత్‌లో కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష

– గెలిస్తేనే రాహుల్‌కు పగ్గాలు

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 26,(జనంసాక్షి): దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యల పోరాటంలో కాంగ్రెస్‌ విఫలమవుతూనే ఉంది. ఎన్నికల్లో పోటీ చేయడం, ఓడిపోవడం వల్ల రాహుల్‌ నాయకత్వంపై నమ్మకం పూర్తిగా సడలిపోతోంది. దీంతో ఇప్పుడున్న స్థితిలో కాంగ్రెస్‌ మరోమారు రానున్న ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. త్వరలోనే కాంగ్రెస్‌ అధ్యక్షపీఠాన్ని రాహుల్‌కు అప్పగించే తరుణంలో గుజరాత్‌, కర్నాటక తదితర రాష్టాల్ర ఎన్నికలు ఆయన నాయకత్వానికి సవాల్‌ కానున్నాయి. గుజరాత్‌లో రాహుల్‌ తాజాగా చేపట్టిన ఎన్నికల పర్యటనకు మంచి స్పందనే వస్తోంది. పాటిదార్లు కూడా మద్దతు పలుకుతున్నారు. గుజరాత్‌లో కాంగ్రెస్‌ గెలిస్తే దేశంలో ఎక్కడా గెలవకున్నా, రాహుల్‌ నాయకత్వంపై దేశ ప్రజలకు భరోసా ఏర్పడుతుంది. ఇటీవల విదేవీ పర్యటనలో ఉన్న సమయంలో కూడా రాహుల్‌ పరిణతి చెందిన నేతగా మాట్లాడలేక పోయారు. దీనికితోడే కాంగ్రెస్‌ వృద్ధతరం నేతల సలహాలు కూడా కాంగ్రెస్‌ను ముందుకు సాగనీయడం లేదు. ఈ దశలో నాయకుడిగా రాహుల్‌ ఎదగడానికి అవసరమైన కసరత్తు చేయాలి. దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసి, గత పదేళ్ల యూపిఎలో ఎందుకు చేయలేకపోయారో,ఏమేవిూచేశారో చెప్పగలగాలి. ఆ సత్తా ఉంటేనే కాంగ్రెస్‌ నేతగా రాహుల్‌ రాణిస్తాడు. అయితే స్వాతంత్య్రా నంతరం ఎక్కువ కాలం అధికారంలో ఉండడం వల్ల అది విపక్షంగా మనలేకపోతోంది. కాంగ్రెస్‌ నాయకులకు సలహాలు ఇచ్చే వృద్దతరం కూడా నీడపట్టున ఉండాలని కోరుకుంటున్న వారే ఎక్కువగా ఉన్నారు. యూత్‌ ను ఆకర్శించికొత్త నాయకత్వాన్ని తయారు చేసుకునే స్థితిలో కాంగ్రెస్‌ లేదు. ఇంకా కుటుంబ, వారసత్వ రాజకీయాలపైనే కాంగ్రెస్‌ ఆధారపడుతోంది. దివంగత పివి లాంటి నాయకుడు కాంగ్రెస్‌లో పుడితే తప్ప అది మనగలగడం కష్టం. ఇకపోతే ఇటీవల నోట్ల రద్దుతో ఏర్పడ్డ సమస్య వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు, ఇక్కట్లకు గురైనా సమస్యను గుర్తించి పోరాడడంలో కాంగ్రెస్‌ పూర్తిగా విఫలమయ్యింది. పార్లమెంట్‌ సమావేశాల్లో వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుని, గొడవలతో ముగించింది. ప్రతిపక్షంలో ఉంటూ నిబ్బరంగా ఉండాలంటే, శ్రమపడే తత్వం ఉండాలి. నిబద్ధతా ఉండాలి.కాంగ్రెస్‌కు ఒక పార్టీగా అటువంటి శ్రమించే, ఉద్యమాలతో నడిచే స్వభావం ఒంటబట్టలేదు. అటువంటి స్వభావం ఉన్నవారు కాంగ్రెస్‌లో ఉన్నా వారిని ముందుకు తీసుకుని రావడంలేదు. సమస్యలను గుర్తించి పోరాటం చేయలేక చతికిల పడుతోంది. ఏ సమయంలో ఏ అంశాన్ని ఎత్తుకోవాలో కాంగ్రెస్‌లో స్పష్టత లేకుండా పోయింది. దీనికితోడు నాయకత్వ సమస్య కూడా కాంగ్రెస్‌ను వేధిస్తోంది. రాహుల్‌ నాయకత్వాన్ని ప్రజలు అంగీకరించలేదని తేలిపోయింది. అతనిలో నాయక లక్షణాలు లేవని ప్రజలు గుర్తించారు. అందుకు తగ్గట్లుగానే కాంగ్రెస్‌ కార్యాచరణ ఉంటోంది. సోనియా అనారోగ్యం పేరుతో పక్కకు తప్పుకుని రాహుల్‌కు పూర్తిస్థాయిలో అవాకాశం కల్పించినా సమస్యలను చర్చించడంలో ప్రజలను తమవైపు తిప్పుకోవడంలో రాహుల్‌ విజయం సాధించలేకపోతున్నారు. పార్టీని గుప్పిట్లో పెట్టుకుని కార్యకర్తలను హుషారెత్తించ లేక పోతున్నారు. ఇక ప్రియాంకను రాజకీయాల్లోకి తీసుకుని రావాలా వద్దా అన్న విూమాంసలో నేతలు కొట్టు మిట్టాడుతున్నారు. ప్రియాంక కూడా ధైర్యం చేయగలిగే నాయకత్వ లక్షణాలను ప్రదర్శించలేక పోయిందని అర్థం చేసుకోవాలి. రాహుల్‌ వచ్చినా, ప్రియాంక వచ్చినా ఇంకా వారసత్వ రాజకీయాలే ఉంటాయి. పివి లాంటి ఉద్దండ నాయకుడిని కాంగ్రెస్‌ సృష్టించుకోగలిగితే తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో అది మనుగడ సాగించడం కష్టం. యువనాయకులను ప్రోత్సహించేలా చూస్తూనే సమస్యలపై రాజీలేని పోరాటాలను కాంగ్రెస్‌ అలవర్చు కోవాల్సి ఉంది. ఇదంతా కూడా ఎక్కువ కాలం అధికారంలో ఉండడం వల్ల పోరాటపటిమను ప్రదర్శించలేక పోతోందని గుర్తించాలి. అందుకే కాంగ్రెస్‌ పరిస్థితి దయనీయంగానే ఉంది. అంతకంటె దయనీయంగా వారి కార్యక్రమాలు ఉంటున్నాయి. కాంగ్రెస్‌ లేని భారతదేశాన్ని నిర్మిద్దామని కేంద్రంలో అధికారం చేపట్టిన మోడీ కాంగ్రెస్‌ విముక్త భారత్‌ అన్న నినాదం ఇస్తున్నారు. సొంతంగా దాన్ని ఎంతవరకు సాధించగలదో చెప్పలేము కానీ, స్వయంగా కాంగ్రెస్‌ పార్టీయే అందుకు సహకరిస్తున్నది. ప్రతిపక్షంలో ఉండగా ఏమి చేయాలో కాంగ్రెస్‌ మరచిపోయినట్టున్నది. పైగా, అధికారంలో ఉండగా చేసిన పాపాలు ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. ఆయా కుంభకోణాల తాలూకు కేసులు వదలడం లేదు. వాటినుంచి నేతలు తప్పించుకునే పరిస్థితి లేదు. అధికారంలో ఉంటే కుంభకోణాలు చేయడం విపక్షంలో ఉంటే చేవచచ్చి పడుకోవడం కాంగ్రెస్‌ నాయకత్వానికి అలవాటుగా మారింది. అందుకే అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ను ఎంత తొందరగా వదిలించుకుందామా అనిపిస్తుంది. ఈ దశలో రాహుల్‌ నాయకుడిగా ఎదిగే అవకాశాలు వచ్చినా చేజార్చుకుంటున్నారు. సమస్యలపై పోరాడాలని జనం కోరుకుంటున్నా, అందుకు తగ్గ ప్రయత్నం కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్నట్టు కనిపించడం లేదు. కాంగ్రెస్‌ అందించవలసింది నాయకత్వాన్ని మాత్రమే. నాయకత్వ బలం విూదనే సామాజిక, రాజకీయ సవిూకరణలు జరిగిపోతుంటాయి.