గుజరాత్‌ ఎన్నికల భయం

– జీఎస్టీ భారం తగ్గింది

– 28శాతం శ్లాబ్‌ నుంచి 177 వస్తువుల తొలగింపు

– జీఎస్‌టీ మండలి కీలక నిర్ణయం

న్యూఢిల్లీ,నవంబర్‌ 10,(జనంసాక్షి): వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ)కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జీఎస్‌టీ అమల్లోకి తెచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు దానిని సవిూక్షిస్తూ సవరణలను చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జీఎస్‌టీ ప్రకారం 28శాతం శ్లాబులో ఉన్న 177 వస్తువులను ఆ శ్లాబు నుంచి తప్పించారు. శుక్రవారం గువహటిలో జరిగిన జీఎస్‌టీ మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో చాక్లెట్లు, చూయింగ్‌గమ్‌లు, షాంపోలు, డియోడోరెంట్‌, షూ పాలిష్‌, డిటర్జెరట్‌, పోషకాహార పానీయాలు, కాస్మొటిక్స్‌ ధరలు తగ్గనున్నాయి. కేవలం 50 వస్తువులను మాత్రమే 28శాతం శ్లాబులో ఉంచాం. ఇప్పటివరకు 227 వస్తువులు 28శాతం శ్లాబులో ఉన్నాయి. ఫిట్‌మెంట్‌ కమిటీ 62 వస్తువులను ఈ శ్లాబు నుంచి తొలగించాలని సిఫారసు చేయగా, జీఎస్‌టీ మండలి అంతకన్నా ఎక్కువ వస్తువులను 28శాతం శ్లాబు నుంచి తొలగించింది. దీంతో చాలా వస్తువులు 28శాతం నుంచి 18శాతం శ్లాబులోకి వస్తాయి. తదనుగుణంగానే ధరలు కూడా తగ్గుతాయి’ అని బిహార్‌ ఆర్థికశాఖ మంత్రి సుశీల్‌ మోదీ తెలిపారు. పెయింట్స్‌, సిమెంట్‌, విలాస వస్తువులు, వాషింగ్‌ మెషీన్లు, ఎయిర్‌ కండీషనర్లు 28శాతం శ్లాబులోనే ఉంచినట్లు చెప్పిన ఆయన చాలా వస్తువులు 18శాతానికి తగ్గించినట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో రూ.20వేల కోట్ల మేర ప్రభుత్వ ఆదాయంపై ప్రభావం చూపుతుందున్నారు.