.గుజరాత్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

The Chief Election Commissioner, Shri Achal Kumar Joti addressing a press conference to announce Election Schedule to Legislative Assembly of Gujarat, in New Delhi on October 25, 2017.

– డిసెంబర్‌ 9, 14 తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికలు

– మొదటి దశ 89, రెండవ దశ 93 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్‌

– డిసెంబర్‌ 18న ఓట్ల లెక్కింపు

– అమల్లోకి ఎన్నికల కోడ్‌

న్యూఢిల్లీ,అక్టోబర్‌ 25,(జనంసాక్షి):గుజరాత్‌ శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం విడుదల చేసింది. డిసెంబర్‌ 9, 14 తేదీల్లో రెండు విడతలుగా ఈ ఎన్నికలను నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి అచల్‌ కుమార్‌ జ్యోతి ప్రకటించారు. గుజరాత్‌లోని మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు రెండు విడుతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మొదటి దశలో 89 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, రెండో దశలో 93 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్‌ 18న ఓట్ల లెక్కింపు జరుగుతుందని అచల్‌ కుమార్‌ తెలిపారు. 2018, జనవరి 22 నాటికి అసెంబ్లీ కాలం ముగియనుందని తెలిపారు. గుజరాత్‌ రాష్ట్రంలో 4.33కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, ఎన్నికల కోసం 50,128 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామన్నారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వీవీపీఏటీలు వినియోగం ఉంటుందన్నారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో సీసీటీవీలను అమరుస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్‌ నేటి నుంచే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు రూ. 28 లక్షలకు మించి ఖర్చు చేయరాదని అచల్‌కుమార్‌ ఆదేశించారు. గుజరాత్‌ ఎన్నికల నేపథ్యంలో.. సాధారణ ప్రజల కోసం మొబైల్‌ యాప్‌ రూపొందించినట్లు చెప్పారు. ఎన్నికల నియామవళి ఉల్లంఘించిన.. అవినీతి జరిగిన తక్షణమే మొబైల్‌ యాప్‌ ద్వారా ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని ఏకే జ్యోతిసూచించారు. కాగా 182 స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికలను బీజేపీ, కాంగ్రెస్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. బీజేపీ ఐదోసారి అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతుండగా, కాంగ్రెస్‌ ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది.

ఆలస్యంపై మండిపడ్డ ప్రతిపక్షాలు..

ఇదిలా ఉంటే సాధారణంగా అయితే గుజరాత్‌, హిమాచల్‌ ఎన్నికలకు ఒకేసారి షెడ్యూల్‌ను ప్రకటించాలి. కానీ.. ఈ సారి అలా జరగలేదు. హిమాచల్‌ ఎన్నికలకు అక్టోబర్‌ 12న ప్రణాళిక ప్రకటించగా.. గుజరాత్‌కు రెండు వారాలు ఆలస్యంగా ఎన్నికల తేదీలను నేడు వెల్లడించారు. గుజరాత్‌లో ఎన్నికల తేదీని ప్రకటించక పోవటంతపై ప్రతిపక్షాల నేతల ఎన్నికల సంఘం తీరుపై మండిపడ్డారు. మాజీ కేంద్ర మంత్రి చిదంబరం లాంటి నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు నిర్వహించకుండా మోడీ ప్రభుత్వం అడ్డుపడుతుందని అన్నారు. మోడీ ప్రభుత్వం కనుసన్నల్లో ఎన్నికల సంఘం అడుగులు వేస్తుందని, అందుకే ఎన్నికలను ఆలస్యం చేస్తుందని విమర్శించారు. చిదంబరంతో పాటు పలువురు ప్రతిక్షాల తీరుపై ఎన్నికల సంఘం తీరును తప్పుపట్టారు. దీంతో రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదల కారణంగా ప్రభుత్వ అధికారులు సహాయకచర్యల్లో ఉండాల్సి వచ్చిందని, అందుకే షెడ్యూల్‌ను ప్రకటించడం ఆలస్యమైందని ఇటీవల ప్రధాన ఎన్నికల కమిషనర్‌ అచల్‌కుమార్‌ జోతి చెప్పారు. కాగా ఎట్టకేలకు బుధవారం గుజరాత్‌ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.