గుజరాత్‌ సర్కార్‌కు సుప్రీంలో ఊరట

న్యూఢిల్లీ,ఆగస్ట్‌29(జ‌నంసాక్షి): గుజరాత్‌ సర్కార్‌కు భారీ ఊరట దక్కింది. గోద్రా ఘటన తర్వాత గుజరాత్‌లో చెలరేగిన హింసాకాండలో దెబ్బతిన్న మత కట్టడాలను నిర్మించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అంటూ అప్పట్లో గుజరాత్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు మంగళవారంనాడు కొట్టివేసింది. దీంతో గుజరాత్‌ సర్కార్‌కు పెద్ద ఊరట లభించినట్టయింది. నాటి అల్లర్ల సమయంలో దెబ్బతిన్న కట్టడాల మరమ్మతు, పునర్నిర్మాణ పనులపై హైకోర్టు ఇచ్చిన తీర్పును గుజరాత్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. అల్లర్లలో ధ్వసంమైన కట్టడాలు, దుకాణ సముదాయాలు, ఇళ్ల పునర్నిర్మాణం, మరమ్మతులకు నష్టపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని, ఇందుకు సంబంధించిన ఓ స్కీమ్‌ను కూడా ఆమోదించినట్టు అడిషనల్‌ సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా అత్యున్నత

న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ పీసీ పంత్‌తో కూడిన ధర్మాసనం తీర్పు చెబుతూ, ప్రభుత్వం ప్రకటించిన స్కీమ్‌ ప్రకారం దెబ్బతిన్న రెసిడెన్స్‌, కమర్షియల్‌ ఆస్తులకు చెల్లించే రూ.50,000 రూపాయల పరిహారం మత కట్టడాలకూ వర్తిస్తుందని పేర్కొంది. గుజరాత్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసింది.