గుట్ట-వరంగల్ రహదారికి 2000 కోట్లు
న్యూఢిల్లీ,జూన్10(ఆరన్‌ఎన్‌ఎ): తెలంగాణలోని యాదగిరి గుట్ట – వరంగల్ రహదారిని 4 లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర కేబినేట్ పచ్చజెండా ఊపింది. యాదగిరిగుట్ట – వరంగల్ 163వ జాతీయ రహదారి అభివృద్ధి కోసం రూ. 1,905.23 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటికే యాదాద్రి అభివృద్దికి వందకోట్లతో సిఎం కెసిఆర్ తసీఉకున్న నిర్ణయంతో శరవేగంగా పనులు సాగుతున్నాయి. ఇప్పుడు కేంద్రం నిధులతో అభివృద్ది పట్టాలకు ఎక్కనుంది. ఇదిలావుంటే సంక్షోభంలో కూరుకుపోయిన చక్కెర పరిశ్రమకు తీపి కబురు అందించారు. బుధవారం సమావేశం అయిన కేంద్ర మంత్రి మండలి వడ్డీ రహిత రుణాన్ని చక్కెర పరిశ్రమకు అందజేయడానికి ఆమోదించింది. 6 వేల కోట్ల రూపాయలను ఇందుకు అనుమతించింది. దీని వల్ల చక్కెర మిల్లుల యజమానులు చెరుకు రైతుల బకాయిలను చెల్లించడానికి వీలవుతుంది. చెరుకు రైతులకు చక్కెర మిల్లుల యజమానులు చెల్లించాల్సిన బకాయిలు మొత్తం 19 వేల కోట్ల రూపాయల వరకు ఉన్నట్లు అంచనా.