గుడ్డి గుర్రాలకు పళ్లు తోమారా?
– ముస్లిం రిజర్వేషన్‌కు కాంగ్రెస్ సంతకాల సేకరణపై కేటీఆర్ ఫైర్
హైదరాబాద్,ఏప్రిల్ 5(జనంసాక్షి):ఇన్నేళ్లూ గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతున్నారా అంటూ కాంగ్రెస్ నేతలపై మంత్రి కెటిఆర్ విరుచుకు పడ్డారు. గత పదేళ్లుగా కేంద్రంలో రాష్ట్రంలో , కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు ముస్లిం రిజర్వేషన్లపై ఎందుకు నోరు మెదపలేదన్నారు. అలాగే పక్క రాష్ట్రంలో ప్రాజెక్టులు కడుఉతంటే ఎందుకు నోరు మెదపలేదన్నారు. మంగళవారం నాడాయన తెలంగాణ భవన్‌లో విూడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ డ్రామాలను తీవ్రంగా దుయ్యబట్టారు. మైనార్టీల కోసం అంటూ సంతకాల సేకరణ చేపట్టడాన్ని తప్పు పట్టారు. ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వం ముస్లిం రిజర్వేషన్లను అమలు చేయడం లేదంటూ కాంగ్రెస్ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. అధికారంలో ఉన్నప్పుడు రిజర్వేషన్లను ఎందుకు అమలు చేయలేదో వివరించి కాంగ్రెస్ నేతలు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 12శాతం ముస్లిం రిజర్వేషన్లకు తాము కట్టుబడి ఉన్నామని… దీనిపై అధ్యయం చేసేందుకు సుధీర్ కమిటీని ప్రభుత్వం నియమించిందని మంత్రి తెలిపారు. ఈ నివేదిక రాగానే రాజ్యాంగ సవరణకు కేంద్రం వద్దకు వెలతామని, అప్పుడు కాంగ్రెస్ తమతో కలసి అఖిలపక్షంగా రావాలన్నారు. అంతేగానీ రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు. ఎక్కడా దిక్కుతోచక రాజకీయాలు చేస్తున్నారని
కాంగ్రెస్ నేతలపై మంత్రి మండిపడ్డారు. రాష్ట్రంలోని ప్రధానమైన నీటి సమస్యపై చర్చిద్దామంటే అసెంబ్లీ నుంచి పారిపోయిన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇవాళ కొత్త డ్రామాకు తెరలేపారని విమర్శించారు. గతంలో చేసిన పాపాలు బయటపడతాయనే భయంతోనే కాంగ్రెస్ వణికిపోయిందని దుయ్యబట్టారు. చర్చకు రమ్మంటే భయపడిన కాంగ్రెస్ నేతలు ఇవాళ ముస్లింల రిజర్వేషన్లపై కొత్తగా మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని ధ్వజమెత్తారు. ముస్లింకు రిజర్వేషన్ల పేరిట ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సంతకాల సేకరణ చేయడం అర్థరహితమన్నారు. వాళ్లు అధికారంలో ఉన్నపుడు యూపీఏ వేసిన రాజేందర్‌కుమార్ సచార్ కమిటీ నివేదికను అమలు చేయలేదని గుర్తు చేశారు. ఇవాళ టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. దివాళాకోరు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. ముస్లింలకు టీఆర్‌ఎస్ నిబద్దత గురించి తెలుసన్నారు. తాము తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల అంశం ప్రస్తావించామని, అధికారంలోకి వచ్చాక కూడా అదే విషయం చెప్పామని గుర్తు చేశారు. తప్పకుండా ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించి తీరుతామన్నారు. కాంగ్రెస్ గతంలో అధికారంలోకి
వచ్చాక వాళ్లు ఇస్తామన్నా రిజర్వేషన్లను 4 శాతంతో సరిపెట్టారని విమర్శించారు. కానీ తాము కాంగ్రెస్‌లా తప్పు చేయలేమని స్పష్టం చేశారు. వాళ్లు ఉద్దేశ్య పూర్వకంగా చేసిన తప్పును తాము పునరావృతం చేయలేమని పేర్కొన్నారు. రాజ్యాంగ సూత్రాలు, నిబంధనలు పట్టించుకోకుండా ముస్లింల రిజర్వేషన్లను జఠిలం చేశారని, కోర్టు మొట్టికాయలు వేసే వరకు తెచ్చుకున్నారని దుయ్యబట్టారు. ఏదో ఇచ్చినట్టు కనపడాలే కాబట్టి ఇచ్చారే కానీ కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేకుండే అని వివరించారు. కానీ తాము పార్లమెంట్ ఒప్పుకునేలా చేసి, పార్లమెంట్ ఆమోదం పొంది ముస్లిం రిజర్వేషన్లను అమలు చేస్తామన్నారు. తాము పాటించే నియమం దేశానికే ఆదర్శవంతంగా నిలిచేలా రిజర్వేషన్లు ఉంటాయని వివరించారు.
సంతకాలు అది ఇది అని కాంగ్రెస్ నేతలు దివాళాకోరు, చిల్లర రాజకీయాలకు పాల్పడొద్దని హితవు పలికారు. కావాలంటే రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందేలా ప్రభుత్వానికి సహకారం అందించాలని కోరారు. రాజ్యాంపరంగా ఏ రాష్ట్రంలో కూడా రిజర్వేషన్లు 50 శాతంకు మించి ఉండరాదనే నిబంధన ఉందని గుర్తు చేశారు.




