గుణహీనుడు సమాజానికి చేటు

(ఆధ్యాత్మిక చింతన )
తిరుమల,ఫిబ్రవరి24(జనం సాక్షి): మనిషి ఎంతటి ఉన్నత విద్యావంతుడైనా గుణహీనుడైతే అతడి వల్ల సమాజానికి ఏవిూ లాభం లేదు.లోకంలో తీయగా మాట్లాడేవారికి కొదవ లేదు. కానీ అందరి మాటల్లోనూ ఆత్మీయత ఉంటుందని చెప్పడం సాధ్యం కాదు.కొందరు పైకి చిలుకపలుకులు పలుకుతూ ఊరిస్తుంటారు. ఆచరణలో కపటాన్ని ప్రదర్శిస్తారు. కొందరు పైకి కఠినంగా మాట్లాడతారు కానీ వారు హృదయంలో ప్రేమను, హితాన్ని కలిగి ఉంటారు. పైపై మాటలను చూసి మోసపోరాదు. ఎదుటివారి హృదయాన్ని గ్రహించాలి. గుణాలే మనిషికి గౌరవాన్ని కలిగిస్తాయి. గుణాలు కలిగినవాడు బాలుడైనా పూజ్యుడే. గుణహీనుడైతే వృద్ధుడైనా పనికిరానివాడే. సద్గుణ సంపదలను సాధించడానికి మనిషి ప్రయత్నించాలని నీతివిద్యలు చెబుతున్నాయి. జీవిత ప్రయాణంలో ఎందరో తారసపడతారు. ఎవరూ శాశ్వతం కాదు. నీ నడవడికే శాశ్వతంగా ఉంటుంది. గెలుపుకు పొంగిపోకుండా ఓటమికి కృంగిపోకుండా ధర్మబద్ధంగా ఫలాపేక్ష లేకుండా కోరేవారికి సాయపడుతూ సాగిపోవడమే జీవితం. మన గురించి నలుగురు ఏమనుకుంటున్నారో అని ఆలోచించే కన్నా మన గురించి మనం ఏది ఆలోచిస్తున్నాం అన్నదే ముఖ్యం. ఎదుటి వారిని కలుపుకు పోయే మనస్తత్వం,మంచితనం మనలో ఉంటే అందరూ మనతోనే ఉంటారు. అందరు నవ్వుతూ పలకరించే వాళ్ళే. అయినా అందులో ఎవరు స్వచ్చంగా ఉన్నారో తెలుసుకోవడం కష్టం. కోపంలోనే మనిషి అసలు వ్యక్తిత్వం బయట పడుతుంది కోపంలోనే మనసులో ఉన్న నిజమైన భావాలు బయట పడతాయి.