గుప్తనిధుల కోసం నరబలి

ఇటీవలి హత్యలతో ప్రజల్లో ఆందోళన
అడ్డూ అదుపులేని దుండగుల తవ్వకాలు
అనంతపురం,జూలై 23(జ‌నంసాక్షి): గుప్తనిధులతో రాత్రికి రాత్రే ఐశ్వర్యవంతులు కావచ్చనే కొందరి అత్యాశ దారుణాలకు దారి తీస్తోంది. గుప్తనిధుల కోసం చారిత్రక కట్టడాలు, పురాతనాలయాలు నిలువునా కూల్చేస్తున్నారు. దేవుడి విగ్రహాలనూ వదలడం లేదు. గుప్తనిధుల వేటలో దుండగులు అరాచకాలకు
పాల్పడుతున్నారు. గతంలో గుప్తనిధుల తవ్వకాలకు ముందు జంతు బలులు ఇచ్చేవారు. ఇప్పుడు ఏకంగా నరబలికి బరితెగిస్తున్నారు. ములకలచెరువు మండల సరిహద్దులో ఉన్న అనంతపురం జిల్లా తనకల్లు మండలం కొర్తికోట గ్రామ సవిూపంలోని శివాలయం ముందు ఇటీవల నిద్రిస్తున్న కమలమ్మ, శివరామిరెడ్డి, సత్యలక్ష్మిల గొంతుకోసి అతిదారుణంగా హత్య చేసిన ఉదంతం ఈ కోవలోకి వస్తుంది. ఇక వారి రక్తంతో శివలింగం, ఎదురుగా ఉన్న పుట్టకు అభిషేకం చేయడంతో గుప్తనిధుల కోసం నరబలి ఇచ్చారని జోరుగా ప్రచారం సాగింది. అనంతపురం జిల్లా కొర్తికోటలోని ఈశ్వరుడి ఆలయం ముందు నిద్రిస్తున్న ముగ్గురిని దుండగులు అతికిరాతకంగా హత్య చేయడంతో సరిహద్దు గ్రామాల్లో భయం నెలకొంది. గుప్త నిధుల కోసం నరబలి ఇచ్చారని ప్రచారం జోరుగా సాగడంతో రాత్రివేళలో సరిహద్దు గ్రామాలప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. ప్రతి రోజూ ఇళ్లముందు పడుకునే గ్రామస్తులు బయటకు రాకుండా ఇళ్లలోనే పడుకున్నారు. ములకలచెరువు మండలంలో అధికంగా ఉన్నర పురాతన ఆలయాల్లో గుప్తనిధుల కోసం చేసిన తవ్వకాలు, దేవుడి విగ్రహాలను ఎత్తుకెళ్లిన ఘటనలు, విగ్రహాలు, ధ్వజస్తంభాలను ఘటనలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ములకలచెరువు ప్రాంతాన్ని చోళులు, చాణిక్యులు, విజయనగరరాజులు, పాలేగాళ్లు పాలించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి.  ఇక్కడి పురాతన కట్టడాలు, ఆలయాల్లో గుప్తనిధులు ఉన్నాయని కొందరు ఇప్పటికీ నమ్ముతున్నారు. అందుకే పక్కా పథకం ప్రకారం రాత్రి వేళల్లో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారు. ముఠాల బారిన పడి ఆలయాల రూపురేఖలు మారిపోతున్నాయి. పురాతన ఆలయాల్లో దేవుళ్ల విగ్రహాల అంతర భాగంలో వజ్ర వైడుర్యాలు ఉన్నాయన్న ఆశతో గుప్తనిధుల ముఠాలు వీటిని పగులగొట్టి పనికిరాకుండా చేస్తున్నాయి. సోంపాళ్యంలో 16వ శతాబ్దంలో విజయనగర రాజులు నిర్మించిన చెన్నకేశవస్వామి ఆలయంలో మూడేళ్ల క్రితం గుప్తనిధుల ముఠా ఏకంగా గర్భగుడిలో తవ్వకాలు జరిపేందుకు పథకం పన్నింది. కాపలాగా ఉన్న ¬ంగార్డులు గమనించి ఎదుర్కోవడంతో దుండగులు వారి కళ్లలో కారంపొడి చల్లి పరారయ్యారు. అలాగే గతేడాది ఏప్రిల్‌ 9న ఈ ఆలయంలో మళ్లీ దొంగలు పడ్డారు. గుప్తనిధుల కోసం ఆలయంలోని రాతి కల్యాణ మండపం పైభాగంలో మొగ్గ ఆకారంలో ఉన్న శిలను ధ్వంసం చేశారు.  నందీశ్వరుని ఆలయంలో దుండగులు పలుమార్లు తవ్వకాలు జరగపడంతో ఆలయం కూలిపోయింది. శిల్పాలలో నిధులు దాచి ఉంటారని పగులగొట్టి ధ్వంసం చేశారు. ఇక్కడికి సవిూపంలోని శ్రీవీరాంజనేయస్వామి ఆలయం వెనుక పలుమార్లు తవ్వకాలు జరపడంతో ఆలయం గోడ కూలిపోయింది. సోంపాళ్యం నుంచి గట్టుకిందప్లలెకు వెళ్లే దారిలో శ్రీకోటచౌడేశ్వరి పాదాలున్న చోట పదిఅడుగుల వరకు తవ్వకాలు జరిపారు. సోంప్లలెలోని పురాతన శ్రీచంద్రమౌళేశ్వరస్వామి ఆలయంలో ఉన్న నందీశ్వరుడి విగ్రహం ధ్వంస చేశారు. గొళ్లపల్లె సవిూపంలో ఉన్న అతిపెద్ద శివలింగాన్ని దుండగులు ఎత్తుకెళ్లారు. కొద్దిరోజుల తరువాత శివలింగాన్ని తిరిగి అక్కడే తెచ్చి పెట్టారు. అలాగే పెద్దపాళ్యం సవిూపంలో ఉన్న కోట తవ్వకాలతో పూర్తిగా శిథిలమైంది. శిల్పాలు, స్తంభాలు విరిగిపోయాయి. పెద్దేరు ఒడ్డున ఉన్న అంకాలమ్మ ఆలయంలో దుండగులు నిధుల కోసం పలుమార్లు తవ్వకాలు జరిపారు. కనుగొండ అటవీ ప్రాంతంలోని శ్రీకనుగొండ రాయస్వామి ఆలయంలో కూడా గుప్తనిధుల కోసం పలుమార్లు దుండగులు తవ్వకాలు జరిపారు.