గుర్జర్ల ఆందోళన

1

నిలిచిన 100 రైళ్లు

రాజస్థాన్‌,మే22(జనంసాక్షి): ప్రభుత్వోద్యోగాల్లో తమకు వాటా కల్పించాలంటూ గుజ్జర్లు చేస్తున్న ఆందోళన తీవ్రతరమవుతోంది. మొదటి రోజుకంటే ఎక్కువ ప్రభావంతో వారి ఆందోళన రెండో రోజుకొనసాగింది. చర్చలు జరిపేందుకు నిరాకరిస్తూ వారు ఆందోళనను రెట్టింపు చేశారు. ప్రధానంగా ఢిల్లీ-ముంబై రైలు మార్గాన్ని స్థంభింప జేశారు. దీంతోపాటు ఇతర రైలు మార్గాలను కూడా అడ్డుకొని పట్టాలపైకి వందల సంఖ్యలో చేరారు. రహదారులపై భైఠాయించారు. దీంతో రవాణా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు వంద రైళ్లు నిలిచిపోయాయి. ప్రభుత్వోద్యోగాలలో తమకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ గతంలో చేసిన తరహాలో తమ ఆందోళనను గుజ్జర్లు పునరుద్ధరించారు. ఈ నేపథ్యంలో తమతో చర్చలకు రావాలంటూ రాష్ట్ర ప్రభుత్వం గుజ్జర్ల నాయకులకు లేఖలు పంపించింది. అయితే, వారు మాత్రం చర్చలతో లాభం లేదని, నేరుగా తమ డిమాండ్‌ అంగీకరిస్తే ఆందోళన ఆపుతామని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్ణయం కోసం తాము ఎదురు చూస్తామని చెప్తున్నారు. ఈ ఆందోళనకు గుజ్జర్‌ అర్కషాన్‌ సంఘర్ష్‌ సమితి నాయకత్వం వహిస్తోంది.