గుర్మీత్ అభిమానులకు వార్నింగ్ : కనిపిస్తే కాల్చివేత

దిల్లీ: అత్యాచార కేసులో దోషిగా తేలిన డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌కు న్యాయస్థానం నేడు శిక్ష ఖరారు చేయనుంది. ఈ నేపథ్యంలో రోహ్‌తక్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. గుర్మీత్‌ అనుచరులు విధ్వంసానికి పాల్పడకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఎక్కువ మంది ఒకే చోట గుమిగూడకుండా చూస్తున్నట్లు సీనియర్‌ పోలీసు అధికారి నవదీప్‌ సింగ్‌ తెలిపారు. అంతేగాక శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా చూసేందుకు కాల్పులకు కూడా వెనుకాడబోమని అక్కడి పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు.

‘పరిస్థితి చేయి దాటితే.. తుపాకులను కూడా ఉపయోగించాల్సి వస్తుంది. ఆందోళనలను అడ్డుకోవడానికి కాల్పులు జరిపేందుకు మా అధికారులకు అనుమతులున్నాయి’ అని నవదీప్‌ తెలిపారు. కాగా.. తీర్పు నేపథ్యంలో రోహ్‌తక్‌లో బహుళ అంచెల భద్రతను ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. గుర్మీత్‌ను ఉంచిన జైలుకు 10 కిలోమీటర్ల వరకూ భారీ భద్రతను ఏర్పాటు చేశామన్నారు.

రోహ్‌తక్‌లో ఆందోళనలు చేపడితే వూరుకునేది లేదని డిప్యూటీ కమిషనర్‌ అతుల్‌ కుమార్‌ తెలిపారు. ‘చట్టాన్ని అతిక్రమించి అల్లర్లకు పాల్పడితే ముందు వారిని హెచ్చరిస్తాం. అయినప్పటికీ వినకపోతే.. వారు బుల్లెట్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని అతుల్‌ హెచ్చరించారు. అత్యవసరమైన పనులుంటే తప్ప బయటివారు ఎవరూ నేడు జిల్లాకు రావొద్దని సూచించారు. అంతేగాక రోహ్‌తక్‌కు వచ్చేవారు వారి గుర్తింపుకార్డులను, స్పష్టమైన కారణాలను చెప్పాలన్నారు. లేదంటే వారిని అరెస్టు చేస్తామని అతుల్‌ అన్నారు.