గుర్మీత్ కు పదేళ్ల జైలు

రోహ్‌తక్‌: అత్యాచారం కేసులో దోషిగా తేలిన డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌కు శిక్ష ఖరారైంది. ఈ కేసులో అతడికి పదేళ్ల జైలుశిక్ష విధిస్తూ.. సీబీఐ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. గుర్మీత్‌ను దోషిగా తేల్చుతూ తీర్పు చెప్పిన అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల దృష్ట్యా రోహ్‌తక్‌ జైలులోనే ఓ ప్రత్యేక గదిలో న్యాయ విచారణ చేపట్టిన సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్‌ జగ్దీప్‌ సింగ్‌ ఈ మేరకు శిక్షను ఖరారు చేశారు.ఇద్దరు మహిళలపై గుర్మీత్‌ అత్యాచారానికి పాల్పడినట్లు 2002లో కేసు నమోదైంది. పదిహేనేళ్ల నాటి ఈ కేసులో ఆగస్టు 25న పంచకులలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం గుర్మీత్‌ను దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. దీంతో గుర్మీత్‌ను అరెస్టు చేసి రోహ్‌తక్‌ జైలుకు తరలించారు. గుర్మీత్‌ను దోషిగా తేల్చడంతో పంచకుల సహా పంజాబ్‌, హరియాణాలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. గుర్మీత్‌ అనుచరులు విధ్వంసం సృష్టించారు. వందల సంఖ్యలో కార్లకు నిప్పంటించారు. ఈ ఘటనలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా శిక్షను ఖరారు చేసేందుకు రోహ్‌తక్‌ జైలులోనే న్యాయమూర్తి విచారణ చేపట్టారు. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం జస్టిస్‌ జగ్దీప్‌ సింగ్‌ శిక్షను చదివి వినిపించారు.
 

బోరున విలపించిన గుర్మీత్‌: తనకు 10 ఏళ్ల శిక్ష పడగానే డేరా చీఫ్‌ గుర్మీత్‌ సింగ్‌ ఒక్కసారిగా బోరున విలపించారు. తాను ఏ తప్పూ చేయలేదని, నిరపరాదినని ఏడుస్తూ జడ్జికి మొరపెట్టుకున్నారు.

రంగురంగుల దుస్తులు మాయం: శిక్ష ఖరారైన తర్వాత గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌కు జైలులోనే  వైద్య పరీక్షలు నిర్వహించారు. నిబంధనల ప్రకారం ఆయనకు సెల్‌ను కేటాయించి, శిక్షఖైదీలకు ఇచ్చే తెల్లటి దుస్తులను అందించారు. ఇన్నాళ్లూ కళ్లుమిరుమిట్లు గొలిపేలా రంగురంగుల దుస్తులేసుకున్న బాబా మరో 10 ఏళ్లపాటు వాటికి దూరంగా ఉండాల్సిందే.

శిక్షకు ముందు 10 నిమిషాలు: గతవారం సీబీఐ కోర్టు గుర్మీత్‌ను దోషిగా నిర్ధారించిన అనంతరం హరియాణా, పంజాబ్‌ రాష్ట్రాల్లో చెలరేగిన హింసాకాండ నేపథ్యంలో శిక్ష ఖరారుకు సంబంధించిన విచారణ రోహ్‌తక్‌ జైలులోనే జరిగింది. జడ్జి జగ్‌దీప్‌ సింగ్‌ ఆదేశాల మేరకు అధికారులు జైలులోనే ఏర్పాట్లుచేశారు. చివరిసారిగా ఇరుపక్షాలూ చెరో 10 నిమిషాలు వాదించేందుకు జడ్జి అవకాశం కల్పించారు.

దేశానికి గుర్మీత్‌ ఎంతో సేవచేశారు:  డేరా బాబా గొప్ప సామాజిక సేవకుడని, దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తించైనా నిరపరాధిగా విడిచిపెట్టాలని లేదా శిక్షను తగ్గించాలని డిఫెన్స్‌ న్యాయవాది వాదించారు.
సీబీఐ వాదన: అత్యాచారం కేసులో దోషిగా తేలిన గుర్మీత్‌కు 10 ఏళ్లు తక్కువ కాకుండా శిక్ష విధించాలని ప్రాసిక్యూషన్‌ తరఫు న్యాయవాది జడ్జికి విన్నవించారు.